హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేసీఆర్ రైతుబంధు పాలన పోయి.. రేవంత్ రాబందుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాడు సాగు సంబురంతో రైతుల ముఖాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తే.. నేడు సాగు సంక్షోభంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నూతన సర్పంచులతో ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరై, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాల పునాదులపై పాలనచేస్తూ, ఓటేసిన ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జనం చూపు.. గులాబీ పార్టీ వైపు
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఇబ్బందులపాలైన ప్రజలు. గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఆగడాలు, దుర్మార్గాలను ఎదుర్కొని వేలాది మంది సర్పంచులు జయకేతనం ఎగురవేశారంటూ అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఖానాపూర్ నియోజకవర్గాలను స్వల్ప మెజారిటీతో కోల్పోయామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ బాసటగా నిలిచారని స్పష్టంచేశారు. చూస్తుండగానే రెండేండ్లు గడిచిపోయాయని, మరో రెండేండ్ల తర్వాత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పేదవాడు కావచ్చు.. కానీ మంచి క్యారెక్టర్ ఉన్న మంచి మనిషి అని అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులపై ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందు నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.
సిమెంట్ ఫ్యాక్టరీపై మాట తప్పిన బీజేపీ
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని, స్వయంగా హోం మంత్రి అమిత్‌షాతో హామీ ఇప్పించిన బీజేపీ.. ఆచరణలో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు ద్రోహం చేసిన బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనకపోయినా ఏనాడూ కాంగ్రెస్ పల్లెత్తు మాట ఆనలేదని ఆరోపించారు. రెండు పార్టీల మైత్రి బంధంతో పత్తి రైతులు చిత్తవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు కోసం బీఆర్ఎస్ పార్టీయే రైతుల తరఫున రోడ్డెక్కిందని గుర్తుచేశారు. రెండేండ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ, ప్రజలకు చేసిందేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పడం, దుష్ప్రచారం చేయడం తప్ప ప్రజలకు ఉద్ధరించిందేమీ లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
మేలు చేసిన కేసీఆర్‌పై అక్రమ కేసులు..
రూ.200 ఉన్న ఆసరా పింఛన్లను రూ.2వేలకు పెంచి, రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ ఇచ్చి.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అభాండాలు వేయడం, అక్రమ కేసులు మోపడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ దుర్భాషలాడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి.. ఆ మహానేతపై అక్కసేందుకు? తెలంగాణ తెచ్చినందుకా? ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించినందుకా? పేదింటి బిడ్డల పెండ్లిళ్లకు రూ.లక్ష కల్యాణ కానుక అందించినందుకా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో పనిచేద్దాం
పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో పనిచేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలుచుకొని జడ్పీలపై గులాబీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కొత్త సర్పంచులు నిరాశ పడొద్దని, గ్రామాలకు వచ్చే నిధులు కాంగ్రెస్ సర్కారు ఇచ్చే మెహర్బానీ కాదు.. అది మీ హక్కు అని స్పష్టం చేశారు. రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో రానున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గ్రామాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని దేశానికి ఆదర్శంగా నిలుపుకొందామని కోరారు. పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రాజెక్టులు కట్టారు.. కొనుగోలు కేంద్రాలు పెట్టారు
సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా కేసీఆర్ హయాంలో గోదావరిపై బృహత్తరమైన కాళేశ్వరాన్ని నిర్మించారని కేటీఆర్ గుర్తుచేశారు. అనేక అడ్డంకులను అధిగమించి కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తిచేశారని తెలిపారు. పంటల కొనుగోలుకు 7వేల కేంద్రాలు పెట్టించారని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సాగు అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం.. పంజాబ్, హర్యానా రాష్ర్టాలను తలదన్ని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిందని ఉద్ఘాటించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులు రాజు లెక్క బతికేవారు. రైతుబంధు రూపంలో కేసీఆర్ ఇచ్చే పెట్టుబడి సాయం అందడం వల్ల రంది లేకుంట ఉండేది. ఇంటి వద్దకే ఎరువులు, యూరియా వచ్చేవి. సాగు కోసం పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు ఇవ్వడం వల్ల నిశ్చింతగా పంటలు పండించేవారు. పంటను కొనేందుకు 7వేల కొనుగోలు కేంద్రాలు పెట్టించారు. అందుకే నాడు రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా కేసీఆర్‌పై కోపంగా లేడు. – కేటీఆర్
కేసీఆర్ హయాంలో సాగు సంబురంతో రైతుల ముఖాల్లో సంతోషంతో వెల్లివిరిస్తే.. రేవంత్ సర్కారు వచ్చాక సాగు సంక్షోభంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ కాక, యూరియా దొరక్క, పంట ఉత్పత్తులు కొనే దిక్కులేక అష్టకష్టాలు పడుతున్నారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత పత్తి, సోయా రైతులు చిత్తయ్యారు. వారిని పట్టించుకొనే దిక్కే లేదు.
– కేటీఆర్