హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుక్రవారం హైదరాబాద్‌లో సిట్ విచారణకు హాజరుకావడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గులాబీ శ్రేణులు భారీగా తరలిరావడంతో తెలంగాణభవన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రాజకీయ సెగతో అట్టుడికిపోయాయి. కేటీఆర్‌కు సంఘీభావంగా శుక్రవారం ఉదయం నుంచే గులాబీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్ భవన్ కికిరిసిపోయింది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఇతర నేతలతో కలిసి నార్సింగిలోని తన నివాసం నుంచి ఉదయం 9.10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. 9.30 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తెలంగాణభవన్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అనంతరం సిట్ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఠాణాకు బయలుదేరారు. ఆయన వెంట వెళ్లేందుకు పలువురు మంత్రులు తమ వాహనాలను తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ కారు తెలంగాణభవన్ గేటు దాటగానే పోలీసులు ఆ కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఒకసారిగా పరిస్థితి విషమించింది. రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడటంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితోపాటు అనేకమంది మహిళా కార్యకర్తలు గేట్ల వద్దే బైఠాయించి పోలీసుల తీరును ఎండగట్టారు. పోలీసుల ఓవరాక్షన్‌ను నిరసిస్తూ ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సిట్ కార్యాలయం పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పీఎస్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల మేర బారికేడ్లు నిర్మించి, కిలోమీటరు దూరం వరకు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ పీఎస్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, క్రాంతి కిరణ్ తదితరులు రోడ్డుపైనే ధర్నాకు దిగారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలోని చట్నీస్ హోటల్ వద్ద నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సిట్ కార్యాలయం వద్ద కూడా నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విచారణ ముగిసే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ అకడే కదలకుండా నిరసనలు తెలపడంతో జూబ్లీహిల్స్ రోడ్లన్నీ గులాబీ మయంగా మారాయి. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.