రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కొనుగోలు నిలిపివేస్తున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రోడ్ల మీద ధాన్యం తడిసి రైతన్నలు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి కనీసం కనికరం చూపడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రజలు తిడుతుంటే పైశాచికానందం పొందుతున్నవా రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. ‘ప్రజల బాధలపై పైశాచికానందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకొంటున్న ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలి?’ అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు చూసి ప్రతిపక్షాలు సర్కార్‌ను ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారని విమర్శించారు. దాదాపు 140 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేయలేక రాష్ట్రం చీకట్లోకి వెళ్తుంటే ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గనిపించడం లేదని ధ్వజమెత్తారు. మొదటి మూడు నెలల్లో చేయలేని పనులను చివరి ఆరు నెలల్లో చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్తున్న మాయమాటలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణభవన్‌లో బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు శ్రీధర్ గోవిందు, శేఖర్‌నాయక్, సర్పంచ్ శ్రీనివాస్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతుంటే చూడలేక ప్రభుత్వాన్ని తాము విమర్శిస్తే ప్రతిపక్షాల తిట్లతో తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తున్నదని, పైశాచికానందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డిని ఏమనాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును రేవంత్‌రెడ్డి సర్కార్ అంధకారంలోకి నెడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్‌రెడ్డికి కనికరం వస్తలేదని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకం ఫీజు రీయింబర్స్మెంట్ అని, తాము కూడా దాన్ని అలాగే కొనసాగించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి గురుకుల పాఠశాలల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వరకు అన్ని విధాలుగా విద్యార్థులకు అండగా నిలిచిందని తెలిపారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. కాలేజీలు హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోవాలని తీర్పు ఇచ్చిందని, అయినా కూడా ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టారని, చివరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరకడం లేదని కేటీఆర్ విమర్శించారు. పండించిన ధాన్యంతోపాటు ఇతర పంటలు కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కొనుగోలు నిలిపివేస్తున్నారని అన్నారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి కనీసం మహబూబ్‌నగర్ జిల్లాకైనా ఒక మంచి పనిచేశాడా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు కావడంతో దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి సబ్బండవర్గాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో అమలు చేస్తానని చెప్పి, 30 నెలల తర్వాత కూడా అవి అమలు చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అత్తగారి ఊరైన మాడ్గులలో కూడా కరెంటు కోతలు ఉన్నాయని చెప్పారు.
అడ్డగోలుగా అప్పులు తెచ్చి రైతుబంధును పక్కన బెట్టి రేవంత్ సర్కార్ రాహుల్ బంధును మాత్రం జోరుగా నడిపిస్తున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ప్రతిసారీ అప్పుల కారణంగా అభివృద్ధి చేస్తలేమని సాకులు చెప్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తెచ్చిన 2.80 లక్షల కోట్లను ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించిందని గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ.3.80 లక్షల కోట్లు అప్పు తెచ్చి రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్వకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఈరోజు రియల్ ఎస్టేట్ భూముల ధరలు పడిపోయి రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఐదేండ్లకోసారి జరిగే ఎన్నికల ప్రక్రియలో అధికారం రావడం, పోవడం సహజమని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా 25 సంవత్సరాలపాటు ప్రజలు, వారి ఆకాంక్షల కోసం నిలబడి తెలంగాణ సాధించి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. అటుఇటుగా ఒక్క ఏడాది మాత్రమే రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలన ఉంటుందని, ఆ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. వానకాలం ముందే ఇల్లు సర్దుకున్నట్టు ఎన్నికల ముందే మనం మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు బాగా చేపట్టాలని, అసలు యుద్ధంలో విజయం సాధించి చూపాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల వెంకటేశ్, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, విజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నందున కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్లో నాయకులు చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చెప్పారు. స్వతంత్రంగా సర్పంచ్‌గా గెలిచిన శ్రీనివాస్ వంటి వాళ్లు మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేననే ధీమాతో నేడు గులాబీ సేనలో చేరుతున్నారని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వచ్చే పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
సీఎం అత్తగారి ఊరు మాడుగుల మండలం నుంచే రేవంత్‌రెడ్డి పతనానికి బీజం పడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ‘పార్టీ అంటే అధినాయకత్వమే కాదు, గులాబీ జెండా మోసే ప్రతి కార్యకర్తా పార్టీ ఆత్మనే’ అని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనమే గుండెలనిండుగా ఉండాలని, మనం చేసే ప్రతి పని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చే ప్రతి పిలుపును పాటించాలని కోరారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు ఇవాళ శ్రీధర్ గోవిందు బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. న్యూజిలాండ్ పౌరసత్వాన్ని వదులుకొని ఇండియా పౌరసత్వం తీసుకొని పుట్టినగడ్డకు సేవలందించాలనే తలంపుతో అప్పరెడ్డిపల్లిలో ఇప్పటికే స్టడీ సర్కిల్, జిమ్, లైబ్రరీ వంటివి ఏర్పాటుచేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.