హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం నడుస్తున్నది..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇస్తే, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టింది.. ఈ అక్రమ కాంట్రాక్టులే రెండు జాతీయ పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్, సీఎం రమేశ్‌ల బాగోతం బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలా ఇద్దరూ గిలగిలా కొట్టుకుంటున్నారని శనివారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.
హెచ్‌సీయూ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకున్న తప్పుడు పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలిసివస్తే హెచ్‌సీయూ రూ. 10 వేల కోట్ల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కాంట్రాక్టుపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ‘నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది..అటెన్షన్ డైవర్షన్ కోసం పనికిరాని కథలు చెప్తున్నరు.. రూల్స్ బ్రేక్ చేయడం.. అనుకున్న వాళ్లకు అడ్డదారిలో కాంట్రాక్టు అప్పగించడం నీ దోస్త్ రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య..నీ దోస్త్ రూ.10 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రూ.1600 కోట్ల కాంట్రాక్ట్ అని తేటతెల్లమైంది’అంటూ నిప్పులు చెరిగారు.
ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ..రాష్ట్ర సాధన కోసం పోరాడిన పార్టీ..అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన పార్టీ.. ఏనాడూ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు’అని స్పష్టంచేశారు. ఇరకాటంలో పడిన ప్రతిసారీ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అక్కరకురాని చెత్త విషయాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని గందరగోళ పరచాలని చూస్తున్నాయని మండిపడ్డారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి..రమేశ్ ఇద్దరూ కలిసి చర్చకు రావాలని సవాల్ విసిరారు.