KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కర్నాటకకు వెళ్తున్న కేన్స్ కంపెనీని ఒప్పించి తెలంగాణకు వచ్చేలా చేస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుకోలేకపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కేన్స్ కంపెనీ పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చేలా చేసేందుకు ఎంతో కష్టపడినట్టు ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ గుజరాత్‌కు వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘కేన్స్ సంస్థ తెలంగాణలో పెడతామన్న తమ యూనిట్‌ను గుజరాత్‌కు తరలిచేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అది వింటుంటే చాలా బాధనిపిస్తోంది.
ఈ సంస్థను కర్నాటక నుంచి తెలంగాణకు రప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం’ అని కేటీఆర్ నాటి శ్రమను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు కోసం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ పకన భూమి కేటాయించాలని వారు కోరారని, పది రోజుల్లోనే భూమి కేటాయించామని తెలియజేశారు. దీంతో కేన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్‌లో తమ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిందని, ఇప్పుడు ఆ సంస్థ గుజరాత్‌కు తమ యూనిట్‌ను తరలిస్తుందన్న వార్తలు చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నదన్నారు.
పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో దాదాపు రూ.3,500 కోట్లతో కేన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని, అది సాకారమైతే మన యువతకు ఉపాధితోపాటు రాష్ట్రానికి ఆదా యం పెరిగేదన్నారు. కేన్స్ కంపెనీ తరలిపోవడం తెలంగాణకు చాలా నష్టమంటూ కాంగ్రెస్ సర్కారు అసమర్థతపై కేటీఆర్ మండిపడ్డారు.