హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఐటీ పాలసీతో హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. ఐటీరంగం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రదర్శించిన దార్శనికత, నాడు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ చూపిన చొరవకు ఈ ఏడాది రాష్ట్రంలో ప్రారంభం కానున్న మైక్రోసాఫ్ట్ భారీ డాటా సెంటర్ సజీవ సాక్ష్యం. 2022 మార్చి 7న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. దేశీయంగా కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రస్తుతం వేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలో అందుబాటులోకి తేనున్నారు.
దేశీయంగా ఇప్పటికే పుణె, ముంబై, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు ఉండగా.. వీటన్నింటి కంటే హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న డాటా సెంటరే అతి పెద్దది కావడం గమనార్హం. స్థానిక వ్యాపారాభివృద్ధికి ఈ డాటా సెంటర్ పరోక్షంగా ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, డాటా-నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజినీరింగ్ వంటి ఎన్నో విభాగాల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందు నుంచీ ఆసక్తి చూపిన మైక్రోసాఫ్ట్ సంస్థ బీఆర్ఎస్ హయాంలోనే రూ.276 కోట్లతో 115 ఎకరాలు కొనుగోలు చేసింది. రూ.40 కోట్లతో మేకగూడలో 22 ఎకరాలు, రూ.164 కోట్లతో షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, రూ.72 కోట్లతో చందన్వెల్లిలో 52 ఎకరాలు దక్కించుకొన్నది. దేశంలోనే భారీ డాటా సెంటర్‌కు భాగ్య నగరాన్ని మైక్రోసాఫ్ట్ ఎంచుకోవడంతో మరిన్ని దిగ్గజ సంస్థలు క్యూ కట్టే అవకాశం ఉన్నదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏఐ వినియోగం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ సేవలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారుతుందని ఐటీరంగ విశ్లేషకులు చెప్తున్నారు. మన దేశంలో వంద కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ను వినియోగిస్తుండటం, నైపుణ్యాలు ఉన్న వర్క్‌ఫోర్స్, విస్తరిస్తున్న స్టార్టప్ ఎకో సిస్టమ్ కారణంగా మైక్రోసాఫ్ట్ తన డాటా సెంటర్లను విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ అందులో అధిక మొత్తాన్ని హైదరాబాద్‌లోని డాటా సెంటర్ల విస్తరణకు కేటాయించనున్నది. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో 22,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇందులో ఇంజినీరింగ్, క్లౌడ్ సర్వీసు, రీఅస్సెర్టింగ్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఆపరేషన్లలో వారు విధులు నిర్వహిస్తున్నారు.
గ్లోబల్ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో డాటా సెంటర్లను విస్తరించడంతో రాబోయే రోజుల్లో ఏఐ ఇన్నోవేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మరింత కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఐటీ సంస్థలు టాటా కన్సల్టెనీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌తోపాటు కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ ఎంటర్ప్రైజ్ ఏఐ విస్తరణ, క్లౌడ్ వినియోగాన్ని పెంచుతున్నాయి. సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఆటోమేషన్, ఎంటర్ప్రైజ్ ఉత్పాదకతకు ఈ సంస్థలు మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్, లైసెన్స్‌లు పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. ఏఐ వర్క్‌లోడ్, క్లౌడ్ స్టోరేజ్, హై పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సేవల కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో హైదరాబాద్ డాటా సెంటర్ దోహదపడుతుందని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.
బీఆర్ఎస్ హయాంలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీతో అనేక దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు ‘క్యూ’ కడుతున్నాయి. టీఎస్ ఐపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్తగా కంపెనీ పెట్టాలనుకొనే వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా ప్రభుత్వం అనుమతితో పని లేకుండా మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను రూపొందించారు. ఈ పాలసీతో ఆన్లైన్ ద్వారా తమ కంపెనీ వివరాలు అందించి కేవలం 15 రోజుల్లోనే పూర్తిస్థాయి అనుమతి పొందే వెసులుబాటు కల్పించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటుచేశారు.
టీ-హబ్ ఇంక్యుబేటర్ ద్వారా స్టార్టప్‌ల అభివృద్ధికి కృషిచేశారు. అద్భుతమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇండస్ట్రియల్ పార్క్‌లు, డాటా కనెక్టివిటీతోపాటు ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ-హబ్‌లను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడంతో బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో నేడు ఆ ఫలితాలు మన కండ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి.
‘హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఇంతటి భారీ స్థాయి డాటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉన్నది. రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను ఇక్కడ పెట్టాలని సంస్థ నిర్ణయించింది. రాష్ర్టానికి వచ్చిన భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. ఈ డాటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ కార్యకలాపాలు, డాటా నెట్వర్క్, నెట్వర్క్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగవకాశాలు పెరుగుతాయి.’
-ఎంవోయూ సందర్భంగా 2022 మార్చి 7న నాటి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు