హైదరాబాద్, జూలై 22 (నమస్తేతెలంగాణ): కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని ఓర్వలేకే కేసీఆర్ కిట్ల పథకానికి కాంగ్రెస్ సర్కారు మంగళం పాడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఇంతటి బృహత్తర పథకాన్ని నిలిపివేయడంతో నిరుపేద తల్లులెందరో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఐదువేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మాతాశిశు సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ ఈ మహత్తర పథకానికి అంకురార్పణ చేశారని తెలిపారు. 2014 నుంచి కేసీఆర్ కిట్ స్కీంకు అంకురార్పణ చేసిన తర్వాత గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకే వెళ్లి ప్రసవాలు చేయించుకునేవారని పేర్కొన్నారు.
ఈ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేలతోపాటు తల్లులు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందజేశారని వివరించారు. కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మార్చారని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20 నెలలుగా కేసీఆర్ కిట్లను నిలిపివేసి నిరుపేదలను ఇబ్బందిపెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానంద, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజు, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బాల్క సుమన్ పాల్గొన్నారు.