KTR | సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్ రెడ్డికి సోయొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్ అని.. అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా కారు గుర్తు మీద మాత్రమే ఓటు వేయాలని సూచించారు.
నాగర్‌కర్నూలు జిల్లాలో సత్తా చాటిన సర్పంచ్‌లతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు భయపడవద్దని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఏం చేయలేరని తెలిపారు. దేశంలో మీకు రక్షణగా ఉండేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని సర్పంచ్‌లకు కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు మిమ్మల్ని ఏం చేయలేవని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో.. గ్రామానికి సర్పంచ్ అట్లనే అని కేటీఆర్ తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు సీదా గ్రామ పంచాయతీలకు వస్తాయని అన్నారు. ఐదంచెల ప్రభుత్వంలో అందరూ కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ విధులు అందరూ తెలుసుకోవాలన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో.. అక్కడ ప్రోగ్రెస్ ఉండదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంకా రెండేళ్లే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్లీ పచ్చబడతాయని.. గ్రామాలకు లక్ష్మీ కళ వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.150 కోట్లకు చేరిందని కేటీఆర్ అన్నారు. ఆ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని తెలిపారు. హైదరాబాద్‌లో 9300 ఎకరాలపై రేవంత్ కన్నుపడిందని అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తక్కువ ధరకు భూములు ఇస్తామని వివరించారు. అలా పరిశ్రమలకు ఇచ్చిన భూముల్లో ఏదైనా కట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు. రూపాయికి 30 పైసలు కడితే ఏదైనా కట్టుకోవచ్చా అని నిలదీశారు. రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తెచ్చిండని విమర్శించారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా బీజేపీ మాట్లాడదని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా కొట్లాడి మరీ సత్తా చాటారని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవిర మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు వస్తాయని తెలిపారు. త్వరలో కేసీఆర్ బహిరంగ సభతో పాలమూరు ప్రజలను కలుస్తారని పేర్కొన్నారు.