హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రసాయనరంగులకు దూరంగా కేవలం ఆకులు, పూలు, వేర్ల నుంచి సేకరించిన సహజరంగులతో రూపుదిద్దుకున్న సింగిడి తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సంప్రదాయం, ఆధునికత కలబోతగా ఆవిష్కృతమైన ఈ ఫ్యాషన్ బ్రాండ్ చేనేత రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ‘సింగిడి కలెక్టివ్’ ఫ్యాషన్ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ఈ స్టార్టప్ రూపకర్త విశ్వసారథిని అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా పర్యావరణహితమైన వస్త్రధారణను ప్రోత్సహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. తెలంగాణ నేల స్వభావానికి అద్దంపట్టేలా, పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో సింగిడి రూపుదిద్దుకోవడం విశేషమని కొనియాడారు.
తెలంగాణ గడ్డ ఎప్పుడూ నూతనత్వానికి వేదికగా నిలుస్తుందని, ఇక్కత్ నుంచి గొల్లభామ చీరల వరకు తెలంగాణ నేతన్నల నైపుణ్యం అద్భుతమని ప్రశంసించారు. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందించి, పర్యావరణానికి హానిలేని విధంగా సింగిడి కలెక్టివ్ ముందుడుగు వేయడం హర్షణీయమని పేర్కొన్నారు. వ్యాపారదృక్పథంతో కాకుండా, మన నేతన్నలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో యువత ఇలాంటి స్టార్టప్‌లను స్థాపించడం గర్వకారణమని ప్రశంసించారు. తెలంగాణ మాండలికంలో ఇంద్రధనస్సును సింగిడి అంటారని, పేరుకు తగ్గట్టే సహజసిద్ధమైన రంగులను వినియోగించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత, సేంద్రియ పత్తితో రూపొందించిన పర్యావరణహితమైన ఈ వస్త్రాలు నేటి తరాన్ని ఆకట్టుకొనేలా ఉన్నాయని పేర్కొన్నారు.
కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా, మన మూలాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలన్నదే సింగిడి కలెక్టివ్ లక్ష్యమని ఫౌండర్ విశ్వసారథి పేర్కొన్నారు. అంతరించిపోతున్న సహజరంగుల అద్దకం విధానాలపై లోతైన పరిశోధన చేసి ఈ వస్త్రాలు రూపొందించామని తెలిపారు. చేనేత రంగానికి ఎల్లప్పుడూ అండగా ఉండే కేటీఆర్ తమ ప్రయత్నాన్ని గుర్తించి ఆశీర్వదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన ప్రోత్సాహం తమకు కొండంత బలాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. లింగబేధం లేకుండా, ఆధునిక డిజైన్లతో రూ పొందించిన ఈ వస్త్రాలు www. singidi collective. Com ద్వారా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.