కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అని అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తయా.. ఎప్పుడు క్యాలెండర్ మారుతదా? ఎప్పుడు మళ్లీ మన కేసీఆర్ వస్తాడా అని ఇవాళ తెలంగాణలోని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నరు. -కేటీఆర్
మంచిర్యాల, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆదిలాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయింది.. ఒక రాబందు ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన వచ్చిందని దుయ్యబట్టారు. అన్నదాతల ఆత్మహత్యలన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయించిన హత్యలేనని, రైతు కుటుంబాలకు ఆదుకొని అండగా నిలువాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తేల్చిచెప్పారు. సర్కార్ పంటలు కొనకపోవడంతో ఆగమై ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని, సాయం ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రతి గింజా కొన్నారని, వడ్లు, జొన్నలు, మక్కలు అన్నీ కొన్నారని గుర్తుచేశారు. కానీ.. ఇవాళ కరోనా కంటే డేంజర్‌గా మారిన కాంగ్రెసోళ్లు ఒక్క గింజా కొంటలేరని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల సంక్షేమ ప్రభుత్వం పోయి, రైతులను చంపే ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. రైతులను రాజు చేసే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలంటే మనం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో శనివారం కేటీఆర్ పర్యటించారు. నేరడిగొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు ‘సర్’పై దిశానిర్దేశం చేశారు.
రేవంత్ నిర్ణయం రైతులకు శాపం..
రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపంలా మారిందని కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ‘ఇప్పటినుంచి మీరు పండించే వడ్లు, జొన్నలు, శనగలు ఏవీ కొనరట. మోదీ ప్రభుత్వం ఎంత కొనమంటే అంతే కొంటారట.. అంటే ఎకరానికి 40 క్వింటాళ్ల వడ్లు పండించినా ఒకవేళ మోదీ రేపటిరోజున కేంద్రం కోటా 10 క్వింటాలే అంటే, 10 క్వింటాళ్లే కొంటరట. మిగిలిన 30 క్వింటాళ్లు రైతులు బయట అమ్ముకోవాలట’ అని రైతులకు పేర్కొన్నారు. ఇది ఇవాళ రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తీసుకున్న నిర్ణయమని, మరి పంట కొనకపోతే ఊరుకుందామా? మర్లవడుదమా? ఆలోచించాలని కోరారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు యూరియా సమస్య లేదని, ఆటో అన్నకు ఒక్క ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేదని, ఇప్పుడు కాంగ్రెస్ యాప్ తీసుకొచ్చి రైతన్నలను ఆగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అసలు షాప్‌లోనే యూరియా లేకపోతే యాప్‌లో నుంచి ఎలా వస్తుందని? కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ నిప్పులుచెరిగారు. ‘రైతులకు గన్నీ సంచులు, బార్దాన్లు ఇచ్చే తెలివి కూడా ఈ సర్కార్‌కు లేదు. దోచుకున్న సొమ్ముతో సంచులన్నీ నింపి ఢిల్లీకి పంపిస్తున్నారని తెలిసింది’ అని ఆరోపించారు.
చివరి గింజ దాకా కొంటా అన్నవ్ ఏమైంది?
చివరి గింజ దాకా కొంటా కొంటానని 15రోజుల కిందట అన్నవ్ కదా రేవంత్‌రెడ్డి.. ఇవాళ ఏమైంది మరి? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. చివరి గింజ దాకా కొంటా, మోదీ మెడలు వంచుతా.. అంటూ తొడలుకొట్టి ఇప్పుడు ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలులో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో, 16మంది ఎంపీలకు కూడా అంతే బాధ్యత ఉన్నదని నొక్కి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం వడ్లు కొనమంటే కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఢిల్లీలో ధర్నా చేసి, ప్రభుత్వం మెడలు వంచి, కొనేలా చేశామని గుర్తుచేశారు. ఇవా ళ పంటలు కొనకుండా తప్పించుకుంటున్న రేవంత్‌రెడ్డిని, ఎంపీలను విడిచిపెట్టబోమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కో రుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్స న్ నాయక్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ముథోల్ ఇన్చార్జీలు విలాస్ గాదేవార్, శ్యామ్సుంద ర్, కిరణ్కొమ్రేవార్, చిన్నన్రావు పాల్గొన్నారు.
రైతన్నలు.. ధైర్యం కోల్పోకండి.రెండేండ్లలో కేసీఆర్ తిరిగి వస్తారు.ఒక్కొక్కరిని కండ్లలో పెట్టి చూసుకుంటారు. రైతులు ఆత్మహత్యల పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. రూ.15 వేల రైతుభరోసా, రూ.500 బోనస్ ఏమైందని
అడగండి, నిలదీయాలి. మీ వెంట మేముంటాం.-కేటీఆర్
నెలరోజులైనా పంట కొనలేదు..
మా నాన్న జొన్న పంటను కొనేందుకు సిరికొండ మార్కెట్ యార్డులో నెల రోజులుగా ఉన్నారు. పంట అమ్మకానికి కావాల్సిన పత్రాలను అన్నీ మా నాన్న తీసుకుని పోయినా కొనలేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సంచికి రూ.50 చొప్పున లంచం అడిగారు.
– శిరీష, రైతు పాండురంగ్ కూతురు