హైదరాబాద్: రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని, మూటల ముఖ్యమంత్రి అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నాడు మూటలు మోసే పీసీసీ పదవి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పగా, నేడు డబ్బులు ఇచ్చే తన పదవిని కాపాడుకుంటున్నారని దేశమంతా తెలుసని చెప్పారు. 2015 నాటి ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదని, అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి బ్యాగ్ మ్యాన్ అని పేరొచ్చిందని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఈడీ చేర్చింది. ఇది తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, గతంలో ఎన్నో తప్పులు చేసి, ప్రజాక్షేత్రంలో భంగపడి, తదనంతరం ఏమైనా బుద్ధి వచ్చిందేమోనని ప్రజలు అనుకుంటే.. ఆయన బుద్ధి కానీ, వైఖరి కానీ ఏమాత్రం మారలేదు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా అని కలవరిస్తున్నారు. యంగ్ ఇండియా వెనుకున్న కథ ఏంటో ఈడీ చార్జిషీటు వివరంగా చెప్పింది. తెలంగాణలో 2015లో జరిగిన ఓటు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అప్పటినుంచి బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా రేవంత్ రెడ్డికి బ్యాగ్ మ్యాన్ పేరు వచ్చింది. అది ఓటుకు నోటు కుంభకోణం. ఇది సీటుకు రూటు కుంభకోణం.
రేవంత్ రెడ్డి గురించి నేటి మంత్రి, నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా పత్రికా సమావేశంలో రూ.50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నారని చెప్పారు. ఆయన మాటకు ఆరోజు ఆధారాలు లేకపోవచ్చు. కానీ నేడు ఆధారం ఉందంటూ చార్జిషీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎంతిచ్చారు, ఏ పదవిని అమ్ముకున్నారో ఈడీ స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఏటీఎంలా మారిందనేది వాస్తవమని, ఢిల్లీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే. నేడు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు పోగొట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇలాంటి వ్యక్తా అనే పరిస్థితి ఇవాళ కనబడుతున్నది. 2020లో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉండగా హౌసింగ్ స్కాంకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయని.. నిస్పక్షపాతంగా విచారణ జరగాలంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అక్కడి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు తాము కూడా అదే అంటున్నామని, నాలుగు కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్న నాయకుడిగా అక్కడ కూర్చున్న రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి ఆయనను రాజీనామా చేయించి నిస్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని, మూటల ముఖ్యమంత్రి అని మరోసారి తేలిపోయింది. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకట్‌రెడ్డి చెప్పారు, ఇప్పుడు మూటలు మోసే పదవిని కాపాడుకుంటున్నారని దేశమంతా తెలుసు. పీసీసీ ఆఫీస్ బేరర్ల వద్ద డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ పత్రికకు అందించారని ఈడీ చెబుతున్నదని’ కేటీఆర్ అన్నారు.