ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. సీఎంగా ఉండి రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూ.1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారన్నారు. 2021-22లో శోధా కన్స్ట్రక్షన్ నికర ఆదాయం రూ.2.2 కోట్లు మాత్రమేనని, అలాంటి కంపెనీకి రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.
అమృత్ పథకం టెండర్లకు సంబంధించి వెబ్సైట్లో వివరాలు లేవని, కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ స్వయంగా ఆరోపించారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ తన బావమరిదికి అమృతం పంచి.. కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగిస్తే అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పారు. రాహుల్, కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నామని తెలిపారు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అందుకే కొడంగల్‌లో తిరుగుబాటు మొదలైందన్నారు. రుణమాఫీ, రైతుబంధుకు డబ్బులు లేవంటున్నారు. మహారాష్ట్రలో సిగ్గులేకుండా రూ.300 కోట్ల తెలంగాణ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. పొగులేటి కంపెనీకి రూ.4,300 కోట్ల పనులు అప్పగించారని చెప్పారు. రేవంత్ సర్కార్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సోనియా, చౌహాన్ సహా చాలా మంది పదవులు కోల్పోయారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి పదవులు కూడా పోతాయన్నారు.
మేం ఢిల్లీకి వస్తే మీకెందుకు భయం అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ఢిల్లీకి వస్తామని, దేశ ప్రజల దృష్టికి ప్రభుత్వ మోసాలను తీసుకొస్తామన్నారు. మీ ఆరోపణలపై మీకు నమ్మకం ఉంటే విచారణ జరిపించాలని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగడతానన్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు వెళ్తున్నదని చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈసీ సెక్యూరిటీ పెంచాలన్నారు. రాష్ట్రంలో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయని చెప్పారు.
Live: BRS Working President @KTRBRS addressing the media in New Delhi. https://t.co/hiD7gORaY3
— BRS Party (@BRSparty) November 12, 2024