సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జూన్ 21: దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరున రూ.10 లక్షలకు బదులు రూ.12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులను ధనికులుగా మార్చేందుకు కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, ఇది దమ్మున్న నాయకుడు తీసుకున్న నిర్ణయమని కొనియాడారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ముందుగా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌లో పార్టీ కోసం పనిచేసి చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో అంబేద్కర్ విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి ఆవిష్కరించారు. తర్వాత సిరిసిల్లలోని పద్మశాలి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యం లో నిర్వహించిన ది సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గం అభినందన సభలోనూ కేటీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి గౌర వించుకు న్నామని, దళితబంధుతో పదిరలో పెట్రోల్‌బంక్, దుమాల శివారులో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ పేరిట రైస్‌మిల్లును ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు.
‘సిరిసిల్ల బ్యాంకు’ను నం.1గా నిలపాలి
సిరిసిల్ల అర్బన్ బ్యాంకును రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలపాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో 47 సహకార బ్యాంకులు ఉన్నాయని, వీటన్నింటిలో సిరిసిల్ల అర్బన్ బ్యాం కును అగ్రభాగాన నిలిపేందుకు పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ డిపాజిట్లతోపాటు రుణాలు అందించాలని తెలిపారు. సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అర్బన్ బ్యాంకు ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తరహాలో జరిగాయని, ఈ పోటాపోటీ ఎన్నికల్లో గెలుపొందిన, ఓడిన వారందరికీ అభినందనలు తెలిపారు.
రాబోయే నాలుగేండ్లలో కౌన్సిలర్ ఎన్నికలు మినహా వేరే ఏ ఎన్నికలు లేవని, ఎలాంటి పంచాయితీలు లేకుండా బ్యాంకు అభివృద్ధితోపాటు సిరిసిల్ల పట్టణాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాద్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.