హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో వినూత్న నిరసన తెలిపారు. ‘గణపతి బప్పా మోరియా.. ఇవ్వాలయ్యా యూరియా రేవంత్ దోషం.. రైతన్నకు మోసం’ అంటూ నినదించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పండుగ పూట కూడా ప్రభుత్వం రైతులను రోడ్డుపై నిలబెట్టిందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర రైతాంగానికి వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
15రోజుల సమావేశాలు జరపాలి
కాళేశ్వరం వంటి నీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఏ అంశాన్ని సభలో పెట్టినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన అనేక కార్యక్రమాలను వివరిస్తామని పేర్కొన్నారు.
ఘోష్ కాదు.. పీసీసీ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, దానిపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ కోసం వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదని, పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలు, వైఫల్యాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చిద్దామని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలో కొరతే రాలే..
కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులకు ఏ రోజూ ఎరువుల కొరత రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. యూరియా కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి రాలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులు, ఆధార్‌కార్డులను క్యూ లైన్లో పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. భారీ వర్షాలతో పంట నష్ట పోయిన రైతులపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, 600 మందికి పైగా రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని సవాల్ విసిరారు.