హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. సీఎం రేవంత్‌రెడ్డి 22 నెలల పాలనలో ఉడ్తా తెలంగాణగా రూపుదిద్దుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడటమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. దేశంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుజరాత్ తర్వాత తెలంగాణలో వెలుగుచూడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కొన్ని నెలల కిందట మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రానికి వచ్చి, ఆ కంపెనీలో కూలీలుగా చేరి.. నెలల తరబడి పరిశోధించి నిర్ధారించుకున్న తర్వాత డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇంతపెద్ద దందా జరుగుతుంటే తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోం శాఖ మంత్రిగా వ్యవహరించడం మన దౌర్భాగ్యమని విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి పొద్దున లేస్తే ఈగల్ అని, హైడ్రా అని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, హోం శాఖను కావాలనే తనవద్ద పెట్టుకున్నానని బిల్డప్ ఇవ్వడం తప్ప చేసే పనేమీలేదు.. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం వద్దకు వెళ్లి యాక్టింగ్ చేయడం.. లేదంటే సోషల్‌మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నరో చూడటం.. రీట్వీట్ చేస్తే 20 రోజులు జైళ్లో పెట్టడం.. కేసీఆర్ మీద సీబీఐ కేసు బనాయించడం.. చిల్లర మాటలు మాట్లాడటం.. పిచ్చి పనులు చేయడం..’ తప్ప ప్రజలను ఉద్ధరించిందేమీలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రీ.. ముడుపులు ముట్టాయా?
మహారాష్ట్ర పోలీసులు నెలల తరబడి పరిశోధించి డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం సోయిలేకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రీ.. డ్రగ్స్ వ్యవహారంలో నీకేమైనా ముడుపులు ముట్టాయా? అందుకే మౌనంగా ఉన్నారా? చర్లపల్లిలో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం రాలేదెందుకు? నీ ఈగల్ ఏం చేస్తున్నది? హైడ్రా ఎక్కడపోయింది? హోం శాఖ ఏంచేస్తున్నది?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గణపతి నిమజ్జనం జరుగుతున్న ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి డీజే సౌండ్స్‌తో కేసీఆర్ పాటలు పెడుతున్నారనే కారణంతో యువకుల సౌండ్‌బాక్స్‌లు గుంజుకోవడంలో తలమునకలై ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు బండ్లల్లో డీజిల్ పోసే దిక్కులేదని దుయ్యబట్టారు.
చర్యలు తీసుకున్న తర్వాత మాట్లాడేదేమున్నది?
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేత కేసీఆర్ అందరితో చర్చించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని వెల్ల్లడించారు. ఇక ఈ అంశంపై మాట్లాడేదేమీలేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు ఎవరైనా ఒకటేనని చెప్పారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని తామందరం గౌరవిస్తామని పేర్కొన్నారు. ఇందులో భిన్నాభిప్రాయానికి తావులేదని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేరాంగీకారం తర్వాత విచారణ ఎందుకు?
కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఓ చానల్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే అప్రూవర్‌గా మారి నేరాన్ని అంగీకరించారని పేర్కొన్నారు. గతంలో కడియం శ్రీహరి సైతం తాను కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారని గుర్తుచేశారు. వారే నేరాన్ని అంగీకరించిన తర్వాత ఇక విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ గౌరవించాలని విజ్ఞప్తిచేశారు. ధిక్కరిస్తే బీఆర్ఎస్ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టంచేశారు.
రైతుల తరుఫున ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరం
యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతులను అరిగోస పెడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అందుకే రైతుల తరుఫున బీఆర్ఎస్ పార్టీ ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటుందని ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్.. పార్లమెంటరీ పార్టీ నేత బీఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు, పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, రాధాకృష్ణన్ మంచివారే.. అయినా వారు ఇండియా, ఎన్డీయే కూటమిల తరుఫున బరిలో ఉన్నారని గుర్తుచేశారు. రెండు కూటములకు బీఆర్ఎస్ ఏనాడూ మద్దతివ్వలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయవద్దని నిర్ణయించినట్టు వివరించారు. ఎన్నికలను బహిష్కరించడం ప్రజాస్వామ్యంలో మంచిదికానప్పటికీ నోటా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్కు ఉపరాష్ట్రపతి ఎన్నికల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంచేశారు.ముఖ్యమంత్రీ.. డ్రగ్స్ వ్యవహారంలో నీకేమైనా ముడుపులు ముట్టాయా? అందుకే మౌనంగా ఉన్నారా? చర్లపల్లిలో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం రాలేదెందుకు? నీ ఈగల్ ఏం చేస్తున్నది? హైడ్రా ఎక్కడపోయింది? హోం శాఖ ఏంచేస్తున్నది?
-కేటీఆర్