హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టిందని, రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదని, నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. గురుకులాల్లో విద్యార్థులు మాత్రమే కాదని, మానసిక రోగులకూ కలుషిత ఆహారం అందించడం హేయమని దుయ్యబట్టారు. కళాశాలలో పుస్తకాల జాడే లేదని, నెలన్నర దాటితే గానీ విద్యార్థులకు పుస్తకాలు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
హోంశాఖతో పాటు విద్యాశాఖ, పురపాలకశాఖ, నీటిపారుదలశాఖ, వైద్యశాఖ వ్యవసాయశాఖ వంటి అన్ని శాఖల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం తెలంగాణ ప్రగతికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ‘జాగో తెలంగాణ.. జాగో’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.