హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు పట్టవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ పార్టీల ప్రజాప్రతినిధులు కొత్త పరిశ్రమలు కావాలని అడగరని, ఉన్న పరిశ్రమలను ఉంచాలని కోరరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, తూకానికి అమ్మే పనిలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నాయని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరని, ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరని ధ్వజమెత్తారు. అందుకే మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు.
‘బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు. ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు. కొత్త పరిశ్రమలు కావాలని అడగరు, ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు.
కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి. అందుకే మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదు. ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవు.’ అని కేటీఆర్ విమర్శించారు.