హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ల మేలు కోసమే కేంద్రం విత్తనబిల్లును తీసుకొస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లు ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని స్పష్టంచేశారు. విత్తనరంగంలో రాష్ర్టాల పాత్రలేకుండా చేస్తున్న ఈ బిల్లును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విత్తన, వ్యవసాయరంగాల నిపుణులు వ్యతిరేకించాలని గురువారం ఎక్స్ వేదికగా విజ్ఞప్తిచేశారు. రైతు ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతు కేంద్రంగా, వారి ప్రయోజనాల పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలని స్పష్టంచేశారు. రైతు సంఘాలు, విత్తన, వ్యవసాయరంగ నిపుణులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే బిల్లుపై ముందుకెళ్లాలని మోదీ సర్కారుకు సూచించారు.
కేంద్రం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టంతో ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు మన దేశంలోకి వచ్చే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. విత్తన బిల్లులో నకిలీ విత్తనాల కట్టడి, నష్టపోయిన రైతులకు నిర్దిష్ట పరిహారం ఇచ్చే అంశాలపై దృష్టిసారించకపోవడం శోచనీయమని వాపోయారు. విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం రాష్ర్టాలకు లేకుండా చేసి బడా కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకందారులు, సప్లయ్ చైన్ బాధ్యత వహించేలా ఈ చట్టం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. మరోవైపు నకిలీ విత్తనాలు తయారు చేసిన కంపెనీలను జాతీయస్థాయిలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష లాంటి అంశాలకు పెద్దగా అవకాశం లేదని వివరించారు.
సంప్రదాయంగా విత్తనాలు తయారు చేసుకొనే రైతు సమూహానికి ఈ బిల్లులో ఏ మాత్రం రక్షణలేకుండా పోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. విదేశాల నుంచి నేరుగా విత్తన తయారీ కంపెనీలు దేశంలో తమ విత్తనాలు అమ్ముకొనే విధంగా సులభమైన నిబంధలు ఉన్నాయని, తద్వారా దేశీయ విత్తన భద్రత, విత్తన సౌర్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ర్టాలకు, రాష్ర్టాల్లోని అగ్రీ యూనివర్సిటీలకు ప్రాధాన్యతలేకుండా చేశారని విమర్శించారు. ఈ బిల్లు రాష్ర్టాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తున్నదన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ర్టాలు సొంత చట్టాలు చేసుకొని ముందుకుపోయే అంశాన్ని బలహీనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈజ్ బిజినెస్ పేరిట కేంద్రం.. విత్తనాల తయారీ బాధ్యతను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు యత్నించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలను పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ సవరణలను ప్రతిపాదిస్తుందని స్పష్టంచేశారు. విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ర్టాలకు బాధ్యత ఉండేలా బిల్లులో మార్పులు చేయాలని సూచించారు.
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి పండే పంటలో గరిష్ఠ ఉత్పత్తి మేరకు పరిహారాన్ని నిర్దిష్ట సమయంలో అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని తేల్చిచెప్పారు. ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసేలా కాకుండా రైతుకేంద్రంగా బిల్లుకు రూపకల్పన చేయాలని కోరారు. విత్తన బిల్లు ప్రతిపాదనలు-సవరణలు అనే అంశంపై త్వరలోనే వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో సుదీర్ఘంగా చర్చించి అన్నదాత ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.