Sunkishala Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ఘటన.. ప్రభుత్వ, అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని కండ్లకు కట్టినట్టు చూపింది. ఇంత పెద్ద సంఘటన జరిగినా ప్రభుత్వం కాదు కదా.. జలమండలి, పురపాలకశాఖ ఉన్నతాధికారులకూ పూర్తిస్థాయి వివరాలు తెలియకపోవటం గమనార్హం. ఘటన వెలుగులోకి వచ్చినపుడు ప్రభుత్వంలోని కొందరు పెద్దల హడావుడి.. ఆపై క్రమంగా వ్యవహారాన్ని కప్పిపుచ్చుతూ చోటుచేసుకున్న పరిణామాలు.. అనేక అనుమానాలకు తావిస్తున్నట్టు అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. అసలు సుంకిశాల వ్యవహారానికి సంబంధించి పురపాలకశాఖలో ఎవరు చక్రం తిప్పారు? అనేది ప్రధాన అంశంగా మారింది.
తొలుత అంతా తానై అన్నట్టు వ్యవహరించిన ప్రభుత్వ పెద్ద.. ఒక్కసారిగా తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరించటం ఓ ఉన్నతాధికారిని కాపాడే ప్రయత్నంలో భాగమేనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవటంతో పాటు ఏజెన్సీ, ఇంజినీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా, చిన్న సంఘటనగా చిత్రీకరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏజెన్సీపై ఎందుకు చర్య తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇప్పటి దాకా సమీక్షే లేదు
నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పథకంలో రిటైనింగ్ వాల్ నిలువునా కుప్పకూలిన ఘటనపై తెరవెనుక నాటకీయంగా పావులు కదులుతున్నాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి తెలియకపోవటంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవంగా ఈ వ్యవహారం పురపాలకశాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆ పోర్ట్‌ఫోలియో సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నది. ఆయన అందుబాటులో లేనందున పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి రంగంలోకి దిగి, సమీక్షించాల్సి ఉన్నది. కానీ అదేమీ జరగలేదు. ‘నమస్తే తెలంగాణ’ ఈ సంఘటనను ఈ నెల 8న వెలుగులోకి తెచ్చింది. అదే రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జలమండలి ఎండీతో పాటు ఇతర ఇంజినీర్లను పిలిపించుకొని మాట్లాడారు.
అంటే సీఎం అందుబాటులో లేనందున డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారని అనుకోవచ్చు. మరుసటి రోజు సుంకిశాలకు మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో కలిసి భట్టి వెళ్తున్నారంటూ మీడియాకు అధికారికంగానే సమాచారం వచ్చింది. కానీ చివరి నిమిషంలో భట్టి ఆ పర్యటనకు దూరంగా ఉండటం గమనార్హం. సీఎం అందుబాటులో లేనందున ప్రభుత్వపరంగా వ్యవహారాన్ని భుజాన వేసుకున్నారని అనుకున్నా.. మరుసటి రోజు చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకోవటంతో పాటు ఇప్పటివరకు ఈ వ్యవహారంపై సమీక్ష కూడా చేయలేదు. ఘటనను గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేసేందుకే తీవ్రంగా ప్రయత్నం జరిగింది. జలమండలి అధికారిక వివరణతో అది బూమరాంగ్ అవడంతో మిన్నకుండిపోయినట్టు తెలుస్తున్నది. తాను పర్యటనకు వెళితే సంఘటన వ్యవహారం మరింత కొనసాగింపుగా మారుతుందనే ఉద్దేశంతోనే భట్టి సుంకిశాల పర్యటనకు దూరంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.
అటు తుమ్మల, ఇటు ఉత్తమ్.. ఇద్దరూ జరిగిందేదో జరిగింది, ఏజెన్సీదే బాధ్యత. ప్రభుత్వంపై భారం లేదంటూ, దాన్ని చిన్న సంఘటనగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. మరుసటి రోజు నుంచి అటు ఇంజినీర్లు, ఇటు ఏజెన్సీ.. ఎవరిపైనా చర్య తీసుకోలేదు. పైగా ఈ సంఘటనపై వేసిన త్రిసభ్య కమిటీ వెంటనే నివేదిక ఇస్తుందని చెప్పినా నిర్ణీత గడువు ఇచ్చారా? లేదా? అనేది వెల్లడించలేదు. కమిటీ వేసి ఐదు రోజులైనా ఇప్పటివరకు నివేదిక కూడా రాలేదు. కేవలం ముగ్గురు ఇంజినీర్లకు మెమోలు జారీ చేసి, వారి నుంచి సంజాయిషీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవహారాన్ని పూర్తిగా మూసివేసేందుకే వేగంగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే డిప్యూటీ సీఎం తొలుత హడావుడి చేసి ఆపై మిన్నకుండిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ వ్యవహారంలో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఘటనపై విచారణ కమిటీ వేస్తామని అందరి కంటే ముందుగా ప్రకటించిన పొన్నం ప్రభాకర్.. ఇన్చార్జి మంత్రి హోదాలో కనీసం సమీక్ష చేయకపోవటం, సంబంధిత ఇంజినీర్లతో మాట్లాడటం గానీ చేయలేదు. జలమండలి ఇంజినీర్లతో మాత్రమే కమిటీ ఏర్పాటుచేసి బాధ్యులందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమిటీనైనా స్పష్టత ఇస్తుందా?
సుంకిశాల ఘటనపై జలమండలి అధికారులు ఇచ్చిన వివరణలో స్పష్టంగా ఇది ఏజెన్సీ తప్పిదమేనని పేర్కొన్నారు. కానీ ఇది నాన్ఈపీసీ కింద అప్పగించిన పనులు అనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఈపీసీ అంటే ఏజెన్సీనే సర్వే, డిజైన్ రూపొందించి, పనులు పూర్తి చేసి, ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ఇందులో సంబంధిత శాఖ ఇం జినీర్ల పాత్ర ఉండదు. కానీ నాన్ఈపీసీ పను ల్లో ఏజెన్సీ పనులు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలన్నీ ఇంజినీర్లే తీసుకుంటారు. పనుల్లో వినియోగించే స్టీల్, సిమెంట్‌ను సైతం ఇంజినీర్లు ధ్రువీకరించిన తర్వాతే వినియోగిస్తారు.
ఈ క్రమంలో మధ్యస్థ సొరంగాన్ని జలమండలి ఇంజినీర్లు చెప్తేనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీ స్వతహాగా చేయడానికి వీలుండదు. అంతేకాదు.. మంత్రుల బృందం పర్యటన సందర్భంగా కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంఘటన జరిగినప్పటికీ పథకం పూర్తి కాలేదని, పూర్తి చేసి అప్పగించాల్సిన బాధ్యత ఏజెన్సీపైనే ఉంటుందని, ప్రభుత్వంపై భారం ఉండదని వెల్లడించారు. ఇలా ఈపీసీ పనుల్లోనే జరుగుతుంది. సుంకిశాల నాన్ఈపీసీ అయినప్పటికీ ప్రభుత్వం, ఇంజినీర్లు తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. త్రిసభ్య కమిటీనైనా.. నాన్ఈపీసీ అని చెప్తుందా? లేక ఏజెన్సీదే బాధ్యత అంటూ చేతులు దులుపుకుంటుందా? అన్నది వేచి చూడాల్సిందే.