KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి ఉన్నప్పుడు మానవీయ దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ఉంటుందని సూచించారు. రాజకీయ కోణంలో చూడకుండా దయచేసి సిరిసిల్లతోపాటు రాష్ట్రంలోని నేతన్నలకు కడుపు నిండా ఉపాధి కల్పించాలని కోరారు.
నేతన్న సిరిపురం లక్ష్మీనారాయణ ఆత్మహత్యపై ఆయన శనివారం సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. 2014కు సంక్షోభం ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు. కార్మికులు నెలకు రూ.15 వేలు గౌరవంగా సంపాదించే స్థితికి నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్, స్కూల్ యూనిఫాంలు ఇవ్వడం వల్ల సంవత్సరంలో తొమ్మిది నెలలు ఉపాధి లభించిందని చెప్పారు.
ప్రతి పాలసీ మార్చాలనే విధానం పెట్టుకోకుండా ప్రజలకు మంచి జరిగితే దానిని కొనసాగించే ఆలోచన చేయాలని సూచించారు. ఒక్కసారే నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతామని చెప్పారు. కార్మికుల పక్షాన కొట్లాడగలుగుతామని, అయినా, అల్టిమేట్‌గా నేతన్నలు రోడ్డున పడకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు.
ఆధైర్య పడొద్దు.. అండగా నేనున్నా: కేటీఆర్ భరోసా
నేతన్నలు అధైర్య పడొద్దని, అండగా తానున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. పనిలేదని ఆగం కావద్దని, సర్కారుతో కొట్లాడి పనికల్పించేలా పోరాడుతానని ధైర్యం కల్పించారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని సూచించారు. సిరిపురం లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు వెళ్లి లక్ష్మీనారాయణ మృతదేహానికి నివాళులర్పించారు. అక్కడే కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోదిస్తున్న భార్య వజ్రమ్మను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
పార్టీ ఫండ్ రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అందించారు. కార్మికులెవ్వరూ మనోధైర్యం కోల్పోవద్దని, మీకు అండగా తానున్నానని, బీఆర్ఎస్ కార్యకర్తలమంతా వెన్నంటి ఉంటారని ధైర్యం చెప్పారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి నేతన్న బీమా ఇప్పించాలని కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. చదువుకున్న ఆయన కొడుక్కి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని సూచించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు బొల్లి రాంమోహన్, కౌన్సిలర్లు పూర్ణచందర్ ఉన్నారు.