సిరిసిల్ల, జూలై 14 (నమస్తే తెలంగాణ) ‘ఎన్నడూ లేనివిధంగా జూలైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో రికార్డుస్థాయిలో 450 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి’ అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఆ విషయంలో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. విస్తారంగా వానలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ గురువారం రాజన్నసిరిసిల్ల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. కలెక్టరేట్లో వరద సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మత్తడి దుంకుతున్న గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కదిలి వరద నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని, పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేయాలని, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. కోరారు. జలాశయాలను వీక్షేంచేందుకు వెళ్లే సందర్శకులను నియంత్రించాలని, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న చోట పరీవాహక ప్రజలను చైతన్యవంతం చేస్తూ వారి సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు కలుషితం కాకుండా చూడాలని పబ్లిక్‌హెల్త్ అధికారులను ఆదేశించారు.
వర్షాల కారణంగా రాకపోకలు సాగించలేని గ్రామాల్లో గర్భిణులు, వైద్యం అవసరమున్న వృద్ధులను దవాఖానలకు చేర్చాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ.11,63,900 పరిహారాన్ని మంత్రి కేటీఆర్ మంజూరు చేయించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో బాధితులకు పరిహారం అందజేయనున్నారు. తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన నక్క మల్లికార్జున్(12) వినికిడి సమస్యతో బాధపడు తుండగా, వినికిడి పరికరాల కోసం రూ.6 లక్షల ఎల్వోసీని కేటీఆర్ మంజూరుచేయించారు. గురువారం బాలుడి తండ్రి కొమురయ్యకు మంజూరుపత్రాన్ని అందజేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇన్చార్జి ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్లు ఖిమ్యానాయక్, సత్యప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి తదితరులు పాల్గొన్నారు.