హైదరాబాద్: జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి, కేసీఆర్ వెంటనడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంత ఆస్తులను కూడా లెక్క చేయకుండా ఉద్యమ నిర్మాణానికి తన వంతు కృషి చేశారని చెప్పారు. జిట్టా లాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేరాలన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.