హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : దిల్‌సుఖ్‌నగర్‌లో తమ న్యాయమైన డిమాండ్ల సాధన, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై అనుమానుషంగా లాఠీచార్జి చేయడమే ఇందిరమ్మ పాలనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. యువత, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడాన్ని మంగళవారం ఓ ప్రకటనలో కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలురకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అంటూ కోతలు కోసి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, కేవలం ఐదు వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమని మండిపడ్డారు. ఐదు వేల పోస్టులతో నిరుద్యోగులను మోసం చేయెద్దని హితవుపలికారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో హకుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలు, విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొకాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు. నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, వయోపరిమితి సడలింపు వంటి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే, నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా ఉండి బీఆర్ఎస్ పోరాడుతుందని తేల్చిచెప్పారు.