మేం రేవంత్‌ను విమర్శిస్తే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు? బండి సంజయ్, రఘునందన్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి, అర్వింద్ ఎందుకు తట్టుకోలేకపోతున్నరు?వీళ్లు కాంగ్రెస్‌లో ఉన్నరా? లేక రేవంత్ బీజేపీలో ఉన్నడా?
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. రా జేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాద్రినాయుడు, భాస్కర్‌గౌడ్, షేక్ ఆరిఫ్, వెంకటేశ్ తమ అనుచరులతో కలిసి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో శనివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోదీయే ఇక్కడ అంటారు.
మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారు. ట్రిపుల్ఆర్ సినిమా కన్నా ఆర్ఆర్ (రాహుల్-రేవంత్) ట్యాక్స్‌లు ఎకువ అయ్యాయని ప్రధాని మోదీయే అన్నారు. కానీ, రేవంత్‌రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అక్రమంగా అమృత్ టెండర్ల కట్టబెట్టారని మేము ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేంద్రం నుంచి సమాధానం లేదు.
మూసీ పేరుతో లక్షన్నర కోట్లు లూటీ చేస్తుంటే బీజేపీ వాళ్లు ప్రశ్నించటం లేదు. మణికొండలో కాంగ్రెస్, బీజేపీ ఒకటై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నాయి. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అక్రమ బంధానికి నిదర్శనాలు కావా?’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘మూసీ విషయంలో బీజేపీ ఎట్టకేలకు స్పందించింది.
రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు బీజేపీ నాయకులు స్పందించి ఇవ్వాళ మూసీ పకన పండుకుంటారట. చాలా సంతోషం. మూసీలో జరుగుతున్న అక్రమాలపై అడగండి. లక్షన్నర కోట్లు ఎవడి అబ్బ సొత్తని ఖర్చు చేస్తారో అడగండి. అడగటంతోనే ఆగకుండా విచారణ కూడా చేపట్టాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో హైదరాబాద్‌లో ముఖ్యంగా రాజేంద్రనగర్‌తోపాటు పలు నియోజకవర్గాల్లో అనుమానాలు ఉండేవి. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావు. ఉన్న పెట్టుబడులు తరలిపోతాయి. అభివృద్ధి కుంటుపడతది. హిందూ- ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని కొందరు ప్రచారం చేశారు. కానీ, కేసీఆర్ అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా అభివృద్ధి చేసి అవన్నీ ఉత్త ప్రచారాలే అనేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారు. దేశంలో తెలంగాణను ఎన్నో రంగాల్లో రోల్ మాడల్‌గా నిలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్‌ను ప్రజలు గెలిపించారు.
పదవులు, పైరవీల కోసం అకడి ఎమ్మెల్యే పార్టీ మారినా మేమున్నామని కార్యకర్తలు పార్టీ వెంటే నిలవటం గర్వంగా ఉన్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తాప పడేరోజు వస్తది. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నడు తప్ప మీరు తప్పు చేయలేదు. మీరంతా పార్టీ వెన్నంటే ఉన్నరు. పార్టీలో కార్తీక్‌రెడ్డి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘మూసీ బాధితప్రాంతాల్లో పర్యటించాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం మొత్తం దాదాపు ఐదారు వందల కుటుంబాలను కలిశాం. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మాతో బాధలు పంచుకున్నారు. తమకు ఎవరు మేలు చేస్తారో, ఎవరు చేయరో, కష్టం వచ్చినప్పుడు ఎవరు తమతో ఉన్నారో అర్థమైందని చెప్పారు. 40-50 ఏండ్ల నుంచి ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్స్‌లు కట్టించుకొని కబ్జాదారులు అంటారా? కోట్ల విలువ చేసే ఇండ్లను కూలగొట్టి…దికులేని వాళ్లను చేస్తారా? అని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు’ అని కేటీఆర్ వెల్లడించారు.
రేవంత్‌రెడ్డితో మాకు గట్టు పంచాయితీ ఏమీ లేదు. కొడంగల్‌లో గిరిజనుల భూమి గుంజుకోవటంపై ప్రశ్నిస్తే ఆయనకు కోపం వస్తున్నది. మూసీ కుంభకోణం గురించి ప్రశ్నిస్తే కోపం వస్తున్నది. అర్హత లేని బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టడంపై అడిగితే కోపం వస్తున్నది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద ఈడీ రైడ్స్ గురించి అడిగితే కోపం వస్తున్నది. ఏదో కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రశ్నించటం మానేస్తామని అనుకుంటున్నారేమో! నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్‌లు పుట్టుకొస్తారు.
-కేటీఆర్
‘కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనకు కూడా వచ్చాయి. గెలుపోటములు కొత్త కాదు. కానీ, వాటిని మనం గట్టిగా ఎదురోవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది ఉండె. 24 ఏండ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాష్ట్రం నలుమూలలా బీఆర్ఎస్ బలంగా మారింది. పల్లెలు, పట్టణాల్లో ఇవాళ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా ఉంటుంది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
‘రేవంత్‌రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ఎత్తయిన కుర్చీలో కూర్చుంటున్నారు. ఎత్తయిన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు. కేసీఆర్ రైతుబంధు రూ.10 వేలే ఇసున్నడు.. మేము రూ.15 వేలు ఇస్తమంటివి.. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు చేస్తా అంటివి. సోనియమ్మ బర్త్‌డే నాడే చేస్తా అంటివి. ఏడాది అయిపోయింది. మళ్లీ సోనియమ్మ బర్త్ డే డిసెంబర్ 9 వస్తున్నది. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వలేదు. సోనియాగాంధీని మాత్రమే కాదు. మొత్తం ప్రజలందరినీ రేవంత్‌రెడ్డి మోసం చేశారు. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్‌రెడ్డి. ఒక హిందూ దేవుళ్లనే కాదు.. అన్ని మతాల దేవుళ్లను మోసం చేశారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘మూసీకి పునరుజ్జీవం అని రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తున్నారు. గత 60 ఏండ్ల్ల నుంచే మూసీలోకి మురుగు నీళ్లు వస్తున్నాయి. మూసీ మురికికూపం కావటానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం. అప్పుడు ఇదే రేవంత్‌రెడ్డి ఆ పార్టీల్లోనే ఉన్నారు. మేము మాత్రమే మూసీని బాగు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం. మూసీని తిరిగి బతికించాలంటే ముందు మురుగు నీటిని శుద్ధి చేయండని కేసీఆర్ మాకు చెప్పారు. ఆయన దాదాపు రూ.4 వేల కోట్లతో 1200 ఎంఎల్డీల ఎస్టీపీలను నిర్మించారు. దేశంలోనే అతి పెద్ద ఎస్టీపీలను హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. చిత్తశుద్ధితో పనిచేయటంతో 100 శాతం మురుగునీటి శుద్ధ్ది నగరంగా హైదరాబాద్ నిలిచింది. 80 శాతం మూసీ శుద్ధి ఎస్టీపీల నిర్మాణంతో పూర్తి అయినట్టే’ అని కేటీఆర్ వివరించారు.
మణికొండలో కాంగ్రెస్, బీజేపీ ఒకటై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నాయి. మణికొండ, మక్తల్, భువనగిరిలో కలిసి కాపురం చేస్తున్నది ఎవరు? ఇవి బీజేపీ, కాంగ్రెస్ అక్రమ బంధానికి నిదర్శనాలు కావా? మళ్లీ వాళ్లే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. బీజేపీ, బీఆర్ఎస్ పదవులు పంచుకున్నట్టు ఒక ఉదాహరణ అయినా చూపించగలరా?
-కేటీఆర్
‘మేడిగడ్డ నుంచి నీళ్లను తీసుకొచ్చి కొండపోచమ్మసాగర్ ద్వారా గండిపేటకు తేవాలని నిర్ణయించాం. ఓవైపు వ్యవసాయానికి నీళ్లు, మరో వైపు పట్టణాలు, హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. గోదావరి నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు గతేడాది మేలోనే తీర్మానం పాస్ చేశాం. 1100 కోట్లతో గండిపేట గేట్లు ఎత్తితే కిందకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. మూసీ మీద దాదాపు 15 బ్రిడ్జిలు కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్‌డ్యామ్‌లు, మూసీలో ఎప్పుడూ నీళ్లుండి దాన్ని జీవనదిగా చేసేందుకు అన్నీ సిద్ధం చేశాం. కేవలం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తే చాలు.. మూసీ పునరుజ్జీవం జరిగినట్టే. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాడంట. ఎందుకు అంత ఖర్చు అంటే ఒకడూ సమాధానం చెప్పడు.’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘రేవంత్‌రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముకు లాంటింది. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. రాహుల్‌గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంకగాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే. అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారు. తెలంగాణలో పదేండ్ల్లలో భారీగా భూముల ధరలు పెరిగాయి. అప్పుడు మేము పారదర్శకంగా భూములు వేలం వేస్తే ఎకరా వంద కోట్లకు పోయింది. అప్పుడు కూడా అందులో సాం ఉన్నదని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ.7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ.7 వేల కోట్లే ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ.లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వెయ్యి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
‘రాహుల్‌గాంధీ అమాయకుడు. పాపం రాసిచ్చింది చదువుతారు. ఆయన లీడర్ కాదు.. రీడర్. అదానీని వ్యతిరేకిస్తూ అకడ రాహుల్‌గాంధీ మాట్లాడుతారు. కానీ ఇకడ రేవంత్‌రెడ్డి అదానీకి రెడ్ కార్పెట్ వేస్తారు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అమావాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులైంది. అదే బీఆర్ఎస్ వాళ్ల ఇండ్లపై ఈడీ దాడిచేస్తే పెన్ను దొరికింది.. గుండుపిన్ను దొరికింది అంటూ నిమిష నిమిషానికి మీడియాకు లీకులిచ్చే ఈడీ, బీజేపీ వాళ్లు.. ఇప్పటివరకు ఒక ప్రకటన కూడా చేయటం లేదు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలందరికీ ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. 11 నెలల పాలనలో ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారని, ఎన్టీఆర్ అలాగే పార్టీని పెట్టి ఎనిమిది నెలల్లోనే అధికారంలో వచ్చారని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పార్టీని స్థాపించి 14 ఏండ్లు పోరాడి కేసీఆర్ లక్ష్యాన్ని సాధించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టానికి అసలైన యజమాని కేసీఆర్ అని, మిగతా పార్టీల నేతలు అందరూ కిరాయిదారులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అబ్దుల్ ముఖీద్ పాల్గొన్నారు.
నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ భస్మాసుర హస్తం కాటేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘శేలు దప్పినోడు శేను వెడ్తె వడగండ్ల వానొచ్చి పోయిందట’ అని ఎక్స్‌వేదికగా ఎద్దేవాచేశారు. ‘420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రూ.15 వేలు రాకపాయె! రూ.2 లక్షల రుణమాఫీ కాకపాయె! 24 గంటల ఉచిత కరెంటు మాయమాయె! పంటల కొనుగోళ్లు చెయ్యకపాయె! వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యకపాయె!’ అని విమర్శించారు. ‘మేలుకో తెలంగాణ’ అని కేటీఆర్ ఉద్బోధించారు.
‘రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారాడో ప్రజలు అడగాలి. అభివృద్ధి కోసం పోయిన అంటే కేసీఆర్ కన్నా రేవంత్‌రెడ్డి ఏం అభివృద్ధి చేసిండో చెప్పుమనాలి. కేసీఆర్ రూ.9,500 కోట్లతో అభివృద్ధి చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అన్నారు. మరి అభివృద్ధి కోసం పోతే మరో వెయ్యి కోట్లు ఎకువ తెచ్చి అభివృద్ధి చేయాలి కదా? ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్టు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖరే చెప్తున్నారు. ఖర్గేను తెలంగాణకు రమ్మని చెప్తున్న.. ఇకడ మా మేకలు మీ మందలో తప్పిపోయాయి చూడాలని కోరుతున్న. మా ఎమ్మెల్యేలను మేకలను కొన్నట్టు ఎందుకు కొంటున్నారు అని అడుగుతున్న. ప్రకాశ్‌గౌడ్, గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ముందా? రాజేంద్రనగర్‌లో ఉపఎన్నిక రావటం ఖాయం. ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయం. రాజేంద్రనగర్‌ను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కార్తీక్‌రెడ్డి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘మనం గట్టిగా మూసీ గురించి అడిగితే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. బాపుఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్తున్నారు. గాంధీజీకి విగ్రహాలు ఇష్టం ఉండవని అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌గాంధీ చెప్పారు. గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు రేవంత్‌రెడ్డి. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? మహాత్మాగాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలకు పైసలు లేవంట. మూసీకి లక్షన్నర కోట్లు మాత్రం ఉన్నాయట. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎంత ప్రయోజనం అంటూ ప్రశ్నించారు కదా? మరి మూసీతో మురిసే రైతులెందరు?, మూసీతో కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత? మూసీ మూటల్లో మీ వాటా ఎంత? అని కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ అంటే వ్యక్తి కాదు.. బీఆర్ఎస్ అంటే సామాన్య శక్తి కాదు. కొందరు పిచ్చి కలలు కంటున్నరు. కేసీఆర్, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా అని రేవంత్‌రెడ్డి అంటున్నడు. నీలాగ 24 ఏండ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికారు.. పిచ్చి ప్రేలాపనలు చేశారు. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్నవారే ఫినిష్ అయ్యారు. వాళ్లతోనే కాలేదు. నువ్వెంత?
-కేటీఆర్
రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలన 11 ఏండ్ల దారుణ పాలనను తలపిస్తున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతులు మొదలు వ్యాపారవేత్తల వరకు కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతుందా? మళ్లీ కేసీఆర్ పాలన ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రతిష్ట అకాశాన్ని అంటితే.. 11 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో దానిని దిగజార్చే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ఆ పార్టీలో ఇమడలేక చాలా మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. వారందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మరోమారు స్పష్టంచేశారు.