హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్) అన్నారు. ఎక్స్ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోని అనేక పార్టీల నేతలు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.
దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ పాలన తెలంగాణకు ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే అబద్ధాలు, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నది. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్‌గా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. అయితే కొత్త ప్రభుత్వానికి ప్రస్తుత సర్కార్ చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలు వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగిత పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు.
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఐదేండ్లు పూర్తికాలం పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు కేసు వల్ల బీజేపీకి వెళ్తాడా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడు ఎలాంటి పరిణామైనా జరగవచ్చని చెప్పారు.
తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడూ ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు.
నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని చెప్పారు.
చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే. మూసీ బ్యూటిఫికేషన్‌కి తాము వ్యతిరేకం కాదు. కానీ మూసీ లూటిఫీకేషన్కి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుంది. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్‌ని కూడా హైడ్రా ముట్టుకోలేదు. కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్ధయగా దోచుకున్నది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారు. ఈ అంశంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అనేక అంశాలను చర్చించాం. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారు. ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే.
రాష్ట్రం ఉన్నన్ని రోజులు, తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కేసీఆర్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు.
ప్రస్తుతం తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపుల విషయంలో ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండటంతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని చెప్పారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి అవసరం ఉందన్నారు. తాము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించమని తెలిపారు. మతపరమైన హింస వాంఛనీయం కాదన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల రోజులపాటు ఎలాంటి కారణం లేకుండా 144 సెక్షన్ విధించడం షాక్‌కు గురి చేసిందన్నారు. ఏదో అత్యంత కీలకమైన అంశం సరిగా లేకుంటేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు.