హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ మణికొండ : మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారుడు హర్షారెడ్డి భూకబ్జాకు బలైన వట్టినాగులపల్లి బాధితులను సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. పొంగులేటి భూ ఆక్రమణలను అడ్డుకుని అండగా ఉంటామని బాధిత సతీష్ షా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి కుమారుడు కబ్జాకు ప్రయత్నించిన స్థలంలోనే బాధిత కుటుంబంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘గండిపేట రెవెన్యూ మండల పరిధి వట్టినాగులపల్లిలో భూమి 1960 నుంచి 60 ఏండ్లుగా సతీశ్ షా కుటుంబం పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. సతీశ్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి ధర ఇప్పుడు దాదాపు రూ.1,400 కోట్ల విలువజేస్తుండటంతో దానిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కన్నుపడింది. పొంగులేటి, ఆయన కొడుకు హర్షారెడ్డి కలిసి స్వయంగా సతీశ్ షా ఇంటికి వెళి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. సతీశ్ షా కుటుంబం భూమి ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది. ఎలాగైనా ఆ భూమిని కాజేసేందుకు మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు’ అని వివరించారు.
‘పొంగులేటి తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే లంచగొండి అధికారి ద్వారా దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు’ అని కేటీఆర్ వివరించారు. 100 కోట్ల లంచం కేసులో ఏడీ శ్రీనివాసులు పట్టుబడ్డాడని, అతడి ద్వారా సర్వే చేయించి బాధితులను బెదిరించారని చెప్పారు. ‘భూమి ఇవ్వకపోతే రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. లొంగకపోవడంతో హర్షారెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్‌స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేసిండ్రు. కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేసిండ్రు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీశ్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడుతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టిండ్రు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను మంత్రి పొంగులేటి బదిలీ చేయించిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధంతోనే ఈ దురాగతాలు జరుగుతున్నయి.. పొంగులేటి ఔటర్‌కు రిండురోడ్డుకు అవతల, ఇవతల వ్యాపారాల పేరిట అరాచకాలు చేస్తూ భూదాహంతో అమాయకులను వేధిస్తున్నారు’ అని నిప్పులుచెరిగారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50% భూమి వాటా డిమాండ్ చేస్తున్నది’ అని కేటీఆర్ చెప్పా రు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడుతామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద, కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు, నాయకులు కార్తీక్‌రెడ్డి, విజయ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, ముక్తార్‌పాషా పాల్గొన్నారు.