KTR | అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని.. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు. బర్త్ డే ఫంక్షన్లకు పోవడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్లు పంపలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వదరల్లో కొట్టుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు. 2014 తర్వాత ఖమ్మంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని.. పువ్వాడ అజయ్లాంటి ఉత్సాహవవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని.. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగిందన్నారు. ఓడిపోయినా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ నాయకులు గులాబీ దండు ఈ సంవత్సర కాలంగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడని.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదన్నారు.
ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని.. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు, పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ప్రాణం ప్రాణం విలువ తెలుసునని.. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే ఖమ్మంలో మంత్రులు పర్యటించేవారన్నారు.