హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘వట్టెం ఎత్తిపోతల పంప్‌లు నీట మునిగాయనే విషయాన్ని పాలమూరు బిడ్డకు ఎవరన్నా గుర్తుచేయండి’ అంటూ బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంప్యూటర్ పునరావిష్కరణ.. పెద్దలను ప్రసన్నం చేసుకోవటానికి ఢిల్లీకి చక్కర్లు.. అంటూ సీఎం రేవంత్‌ను దెప్పిపొడిచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన బాహుబలి వంటి మోటర్లు నీట మునిగినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 18 మీటర్ల లోతు నీటిలో మునిగిన పంపులను తక్షణమే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రగతిని తుడిపేయలేరు
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఎవరూ తుడిపేయలేరని కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో పదేండ్లపాటు అప్రతిహతంగా సాగిన ప్రగతిని ఎవరూ కాదనలేరని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి విడుదల చేసిన గణాంకాలను ఎక్స్‌వేదికగా ట్యాగ్ చేస్తూ.. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 94 శాతం అధికంగా ఉన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరని తాజా గణాంకాలే తేల్చిచెప్తున్నాయని కేటీఆర్ ఉదహరించారు.