హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అస్తిత్వ పోరాటానికి ప్రతీక అయిన కుమ్రంభీం స్ఫూర్తితోనే నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం కుమ్రంభీం జయంతి సందర్భంగా ఆయన పోరాట పటిమను ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ఆయన ‘జల్, జంగల్, జమీన్ అని నినదించిన పోరాటయోధుడని, గోండు బెబ్బులిగా ప్రజలు పిలుచుకున్నారని కొనియాడారు. బడుగు బలహీనవర్గాల హక్కుల సాధనకు, ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి ఆయన పెట్టిన పేరు అని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనే ఎజెండాగా తొలి, మలి తెలంగాణ ప్రభుత్వాల్లో ప్రగతి ప్రస్థా నం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్ లో సుందరమైన ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేసినందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు.