హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంపై మరోసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పార్టీ మారిన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హతవేటు ఖాయమని, త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఉప ఎన్నకలు రానున్నాయని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొకి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓడించేందుకు ప్రజలు, అన్ని స్థాయిల గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌కు రాజయ్య వివరించారు.
అనేక అవకాశాలు ఇచ్చినా, మూడు సార్లు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినా కేవలం రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి గులాబీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధిచెప్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ పార్టీ ఎన్నికల అభ్యర్థిగా ఇప్పటికే అధినేత కేసీఆర్ తాటికొండ రాజయ్య పేరును ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం త్వరలోనే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నాయకులతో చర్చించి సమావేశ తేదీలను నిర్ణయించాలని రాజయ్యకు సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మాతా, శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భర వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ వేసింది. కమిటీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య నేతృత్వంలోని కమిటీలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గాంధీ వైద్యశాలతో పాటు రాష్ట్రంలోని పలు దవాఖానలను సందర్శించి అకడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో కూడిన నివేదికను రూపొందిస్తారని, ఆ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కేటీఆర్ తెలిపారు.