KTR | నల్లగొండ రైతులు శిగమూగారు. ఏడాది లోనే ధిక్కార జెండా ఎగరేశారు. ఓటేసి గెలిపించిన చేతితోనే కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీచేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వక, పథకాలు అందించక రైతు ఉసురుపోసుకుంటే ఊరుకోబోమని ఆగ్రహంతో ఊగిపోయారు. మంగళ వారం బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాదీక్ష నుంచి సర్కారుకు ఘాటు హెచ్చరికలు పంపారు. పచ్చని పొలాలను పడావు పెట్టే పాలన వద్దని క్లాక్‌టవర్ సెంటర్ ప్రతిధ్వనించేలా నినదించారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు నాట్లు వేసేటప్పుడే రైతుబంధు డబ్బులు పడేవని, రేవంత్‌రెడ్డి వచ్చాక ఓట్లప్పుడే రైతుబంధు అంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ కేటాయించిన రూ.7,600 కోట్ల డబ్బులనే రైతుబంధుగా వేశాడని, ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నందున రేవంత్‌రెడ్డి మళ్లీ డ్రామా మొదలుపెట్టాడని నిప్పులుచెరిగారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఎకరాకు రేవంత్ సర్కారు రూ.17,500 బాకీ ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను వీటి సంగతి ఏందని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.
మంగళవారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన ఉమ్మడి జిల్లా రైతు మహాధర్నాలో రైతులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. జనవరి 26న రాత్రి 12 గంటలకే టకీటకీ మని డబ్బులు పడ్తయని సీఎం చెప్పాడని, మరి డబ్బులు పడ్డాయా? అని రైతులను ప్రశ్నించారు. నాడు కేసీఆర్ ఎవరూ అడగకుండానే రైతుల మీద ప్రేమతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం పెట్టి 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని, కేసీఆర్ ఏనాడూ ఓట్ల కోసమో.. ఇంకోదాని కోసమో విన్యాసాలు చేయలేదని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒక్క సంతకంతో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ ఏ ఊరిలో కూడా పావువంతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఇదే విషయమై తాను అసెంబ్లీ సాక్షిగా సీఎంను నిలదీసిన విషయం చెప్పారు.
‘బయట మొరుగుడు కాదూ.. ఇక్కడ మాట్లాడు.. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? నీ కొడంగల్ పోదామా? ఏ ఒక్క ఊరిలో వంద శాతం మంది రైతులు రుణమాఫీ అయ్యిందని చెప్పినా అక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంట అని చెప్పిన’ అంటూ గుర్తుచేశారు. దీనికి సీఎం నోటి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. 2023 డిసెంబర్లో జరిగిన మీటింగ్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్కకు రూ.49,500 కోట్లు రుణమాఫీకి కావాలని బ్యాంకర్లు చెప్పారని తెలిపారు. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40 వేల కోట్ల ఇవ్వవచ్చని ఒక మీటింగ్‌లో.. రూ.39వేల కోట్లు అని మరో మీటింగ్‌లో అన్నారని, చివరకు జూన్‌లో జరిగిన క్యాబినెట్లో 26 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయంటూ బడ్జెట్లోనూ పెట్టారని చెప్పుకొచ్చారు. అది కూడా అమలు కాలేదని, ఇప్పటివరకు రుణమాఫీ కేవలం రూ.12 వేల కోట్లు కూడా దాటలేదని విమర్శించారు. ప్రారంభంలో చెప్పిన రూ.49,500 కోట్లలో ఇప్పటివరకు చేసింది కేవలం పావులా వంతు కూడా లేదని మండిపడ్డారు.
కేసీఆర్ 10 వేలు రైతుబంధు ఇస్తుంటే ఆయన 15 వేలు ఇస్తనన్నడు. పడ్డాయా ఎవరికైనా 15 వేలు? ఇవ్వాళ మాట మార్చి సిగ్గు లేకుండా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నం.. 12 వేలు ఇస్తున్నం అంటుండు. మాటమార్చి మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట!
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్వయంగా కలం పట్టి పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె.. పాలమూరు, నల్లగొండ పంటలు ఎండిపాయె అంటూ పాట రాసిండు. ఫ్లోరైడ్పైనా చూడుచూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ కాళ్లు, చేతులు, నడుం వంకర్లు తిరిగిన లక్షలాది మంది గురించి పాట రాసిండు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. అట్లాంటి నల్లగొండను కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని అగ్రగామిగా తీర్చిదిద్దారని చెప్పారు. ‘ఇవ్వాల నల్లగొండ జిల్లాకు చెందిన మూర్ఖులు కొందరు అజ్ఞానంతో నల్లగొండ అభివృద్ధిపై మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. అసెంబ్లీలో ఒక మంత్రి గారు కేసీఆర్ నల్లగొండకు ఏంచేసిండు అనడిగితే.. దేశంలోనే పంజాబ్‌ను హర్యానాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణలో నంబర్ వన్ చేశాడు కేసీఆర్. తెలంగాణలో నల్లగొండ జిల్లాను ధాన్యంలో నంబర్ వన్ చేశాడని చెప్పినం’ అని వివరించారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ టెయిలెండ్ గ్రామాలకు, ఎస్సారెస్పీ ఫేజ్ టు కింద ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు నీళ్లు వచ్చేవి కాదని, నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కూడా చివరి భూములకు ఎన్నడూ నీళ్లు వచ్చేవి కాదని, కానీ కృష్ణా, గోదావరిలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి అటు పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా..ఇటూ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు నీళ్లిచ్చిన రైతు నాయకుడు కేసీఆర్’ అని స్పష్టం చేశారు. ‘నల్లగొండకు వస్తుంటే పెద్దకాపర్తి వద్ద మా చిరుమర్తి లింగన్న జెండా ఎగరేయాలన్నడు. అక్కడ ఒక రైతన్న కలిసిండు.. మేము అందరం పాలిచ్చే ఆవును వదిలి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నం.. అందుకే మాకు ఈ కర్మ పట్టింది అని ఆ రైతన్న చెప్పిండు. ఈ విషయాన్ని నల్లగొండ సభలోనూ చెప్పాలన్నడు’ అని కేటీఆర్ చెప్పారు.
ఏడాది నుంచి రేషన్ కార్డులు, రైతు భరోసా, కుల గణన అని దరఖాస్తులు పెట్టిస్తూ రైతులను, పేదలను చావగొడుతున్నరు. రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నరా? ప్రజలు పెట్టిన దరఖాస్తునే మళ్లీ మళ్లీ పెట్టి అలిసిపోతున్నరు.
-కేటీఆర్
‘కేసీఆర్ నల్లగొండను ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ చేసిండు. మూడు మెడికల్ కాలేజీలు కట్టిండు. యాదగిరిగుట్ట గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది లక్ష్మీనర్సింహస్వామి రుణం తీర్చుకున్నడు. దామరచర్లలో అద్భుతంగా తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని కట్టించిండు. ఇట్లా చెప్పుకొంటూ పోతే నల్లగొండకు కేసీఆర్ ఎన్నో చేసిండు. నల్లగొండ అభివృద్ధిపై చర్చకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లాక్‌టవర్ సెంటర్‌కు రావాలి. మా భూపాలన్న వస్తడు.. మా జగదీశన్న వస్తడు.. నీ సంగతి చెప్తరు’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవ్ కొడుకో నైజాము సర్కరోడా అని నాడు ఉన్న నియంతలను నిలదీసి పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది నల్లగొండ గడ్డ. ఈ గడ్డను 55 ఏండ్ల నుంచి చూస్తున్న కాంగ్రెస్ వాళ్లు పాతోళ్లే. వాళ్ల పాపంతోనే నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బందై పిల్లల బొక్కల్లో మూలుగ చచ్చిపోయింది. ఇక్కడ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి, రైతులు అవస్థలు పడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్త కొత్త మాటలతో కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ప్రజల ముందుకు వస్తున్నరు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ ఆనాడు రాష్ట్ర రైతాంగానికి సాయుధ పోరాటంతో ఎలా స్పూర్తి నింపిందో ఇప్పుడు మళ్లోసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండే వేదిక కావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందుకే ఇక్కడి నుంచే రైతు పోరాటం మొదలుపెట్టినట్టు చెప్పారు. మహమూద్ అనే ఆటో డ్రైవర్ మధ్యలో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాశనం అయిపోయినమని ఆవేదన చెందాడని తెలిపారు. ఏడాది పాలనలో రైతులు 410 మంది, గురుకులాల్లో 55 మంది విద్యార్థులు, ఆటోడ్రైవర్లు 100 మంది, చేనేత కార్మికులు 35 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానన్న మంత్రికి నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో రైతు ధర్నా పెడుతామంటే భయమెందుకని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకుంటం అనే మంత్రికి ఇంత భయమెందుకు? భూపాల్‌రెడ్డిపై పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేస్తవా? నీకు ధైర్యం ఉంటే గడియారం సెంటర్‌కు రావాలె. మాలెక్కనే మీటింగ్ పెట్టి రైతులకు ఏం చేశావో చెప్పాలె. ఈ ఏడాదిలో ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డికి ఆకారాలు, అహంకారాలే బాగా పెరిగినయ్’ అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేసినా హైకోర్టు రైతుల పోరాటంలో న్యాయం ఉన్నదని పర్మిషన్ ఇచ్చి ధర్నా చేసుకునే అవకాశం కల్పించడంపై న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ‘జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా అధికారులకు కూడా గుర్తు చేస్తన్నం. మర్చిపోకండి. భవిష్యత్తు మళ్లీ గులాబీ జెండాదే. ముమ్మాటికీ బీఆర్ఎస్దే. ఇవ్వాళ ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్నీ గుర్తు పెట్టుకుంటం.. వడ్డీతో సహా తిరిగి ఇస్తం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
జనవరి 26 రాత్రి పన్నెండు గంటలకే టకీటకీ మని డబ్బులు పడ్తయ్ అని సీఎం చెప్పిండు.. పడ్డయా మరి? జనవరి 26కు మొదలై మార్చి 31 వరకు రైతుబంధు సాగుతదట. రైతులు గుర్తుపెట్టుకోవాలె.. మార్చి 31 అన్నడు గని అది ఏ సంవత్సరమో చెప్పలే.. మళ్లీ డబ్బాల ఓట్లు పడ్డంక నేనేడ చెప్పిన అంటడు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం అంటదని కేసీఆర్ ఎన్నికలప్పుడే చెప్పిండ్రు.
– కేటీఆర్
‘నేను వస్తుంటే.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదికి వచ్చిండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా వసతులు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గొడ్డుకారంతో అన్నం పెడుతున్నరు. మీరు యూనివర్సిటీకి రావాలని కోరిండ్రు’ అని కేటీఆర్ చెప్పారు. నల్లగొండ ఐటీ టవర్ కళ తప్పి కనిపించిందని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చాక తాగుబోతుల అడ్డా అయ్యిందో లేక అక్కడ మరెవరైనా ఉన్నారో తెల్వదు అంటూ ఎద్దేవా చేశారు. ‘నల్లగొండలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్‌టవర్ వరకు రైతులను, యువకులను చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు అనిపించలేదు. మళ్లీ కేసీఆర్ గెలిచి మన ప్రభుత్వం వచ్చింది.. మన భూపాల్‌రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయ్యిండన్నంత గొప్పగా, బ్రహ్మాండంగా విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు అనిపించింది’ అంటూ తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమెల్సీ కర్నె ప్రభాకర్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్, రాంచంద్రనాయక్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, నిరంజన్‌వలీ, గుజ్జ యుగేందర్‌రావు, పల్లా ప్రవీణ్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు.
‘రెండు పంటలకు కేసీఆర్ రైతుబంధు ఇస్తుంటే.. మూడు పంటలకు ఇవ్వాలన్నడు. కానీ ఇవ్వాళ ఒక్క పంటకు ఇచ్చేందుకు కూడా కిందామీదా పడుతున్నడు.. కేసీఆర్ 10 వేలు ఇస్తుంటే ఆయన 15 వేలు ఇస్తనన్నడు. ఇవ్వాళ మాట మార్చి 12 వేలే ఇస్తమంటున్నడు. ఇట్ల మోసం చేయడం కూడా చరిత్రాత్మక నిర్ణయమట! రేషన్ కార్డులు ఇవ్వడం కూడా చారిత్రాత్మకమని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నరు. అందుకే గ్రామసభలకు పోతే ఏమాయె రుణమాఫీ? ఏమాయె ఆరు గ్యాంరెటీలు? అని రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నా నోరు మెదపడం లేదు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘కేసీఆర్ ఉన్నప్పడు టింగ్‌టింగ్‌మని డబ్బులు పడుతుండె.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తులు, దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు.. ఒక్క రైతుబంధు మాత్రమే కాదు.. రుణమాఫీ, బోనస్‌లోనూ మోసమే’ అని మండిపడ్డారు. ‘రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్లీ రైతు భరోసా అని డ్రామాలు.. ఎన్నికలు అయిపోతే రైతుబంధు కూడా బంద్ అవుతది’ అని హెచ్చరించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న రేవంత్‌రెడ్డి, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తుకువస్తారని ఆ రైతుబంధునే బంద్ చేద్దామని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కారు రైతులకు యాసంగిలో 2,500, వానకాలం 7500, ప్రస్తుతం 1,500 ఇలా మొత్తం రైతబంధు డబ్బులు ఎకరాకు రూ.17,500 చొప్పున బాకీ పడిందని, కాంగ్రెస్ వాళ్లు ఓట్లడిగేందుకు వస్తే వీటన్నింటిపై నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.