‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు చేసేదే చెత్తపాలన.. ఇంకా దానిపై చర్చ పెడుదామంటున్నవ్..నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. మా పార్టీ తరఫున చర్చకు నేను రెడీ. రైతుల సమస్యలపైనా? లేక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైనా? దేనికైనా సిద్ధం.. రైతు డిక్లరేషన్ సభ పెట్టిన వరంగల్‌లోనా? లేదంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్‌గాంధీ డైలాగ్‌లు కొట్టిన అశోక్నగర్లోనా? ప్రెస్‌క్లబ్‌లోనైనా..అసెంబ్లీలోనైనా డిబేట్‌కు సిద్ధం. ప్లేస్, టైమ్ నీ ఇష్టం. ఎవరొస్తరో రండి. మీ పాలనావైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా. – కేటీఆర్
హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండున్నరేండ్ల చెత్తపాలనపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తా.. రాహుల్‌గాంధీ వస్తారో? ఇంకెవరొస్తారో తేల్చుకోండి. మీ పాలనావైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా’నని చాలెంజ్ చేశారు. రైతు డిక్లరేషన్‌లో ఒక్కటేంటే ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టమొచ్చిన డైలాగులు కొట్టడం.. కారుకూతలు కూయడం కాదు.. సవాల్‌ను నిలబెట్టుకొనే దమ్ముండాలని తేల్చిచెప్పారు. సవాళ్లు విసరడం, వెన్నుచూపి పారిపోవడం ఆయనకు మొదటినుంచీ అలవాటేనని ఎద్దేవా చేశారు. మీరు చేసేదే చెత్త పాలన.. ఇంకా దానికి సిగ్గులేకుండా చిట్‌చాట్‌లా అని కడిగిపారేశారు. ‘జీహెచ్ఎంసీలో మేం గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నడు.. మేం 99 కొట్టినం.. గెలిచినం పారిపోయిండు. కొడంగల్‌లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నడు.. ఓడిపోయిండు.. మళ్లీ సిగ్గుతప్పి పార్లమెంట్లో నిలబడ్డడు.. మరోసారి రైతును రాజును చేస్తున్న చర్చకు రా అన్నడు.. నేను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తే కల్లు కంపౌండ్‌కు రానని ప్రెస్మిత్రులను అవమానించేలా మాట్లాడి తప్పించుకున్నడు’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, విప్ వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, కిశోర్‌గౌడ్, తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి ఇంతటి భావదారిద్య్రం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలోనూ చూడలేదని దెప్పిపొడిచారు. తాను పాలించే రాష్ర్టాన్ని తానే విమర్శించడం, విషం చిమ్మడం మానుకోవాలని హెచ్చరించారు.
ఇజ్జత్ లేకుంటే ఢిల్లీకి ఎందుకుపోతున్నవ్?
ఢిల్లీకి పోతే గౌరవం దక్కడం లేదంటున్న రేవంత్‌రెడ్డి.. ఇజ్జత్ లేకుంటే 72 సార్లు ఎందుకు పోయినట్టు అని కేటీఆర్ ప్రశ్నించారు. కవి దాశరథి నిజామాబాద్ జైలు గోడలపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశారని, అయితే తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అని కేసీఆర్ నాయకత్వం చాటిచెప్పిందని స్పష్టంచేశారు. తాను ఏది రేవంత్‌లా గాలికి మాట్లాడటం లేదని.. ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్రభుత్వ వెబ్సైట్ల్లు, మార్ఫెడ్ శాఖ గణాంకాల ఆధారంగా చెబుతున్నానని స్పష్టంచేశారు. 2014-15లో కేసీఆర్ గద్దెనెకిన రోజు రాష్ట్రంలో 24లక్షల 13వేల హెక్టార్లలో పంటలు పండేవని, దిగిపోయే నాటికి 59.89లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే రేవంత్ మాత్రం ఇష్టానుసారం మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దొంగను దొంగలానే చూస్తరు..
ఢిల్లీకి వెళ్తే తెలంగాణ వాళ్లంటే అసహ్యించుకుంటున్నారని, దొంగల్లా చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలివితక్కువ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. వాస్తవానికి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తిని దొంగలాగే చూస్తారని, ఆ ఘనత ఆయనకే సొంతమని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వాళ్లు అసహ్యించుకుంటున్నది తెలంగాణ ప్రజలను చూసి కాదని.. నోట్ల కట్టలతో పట్టుబడ్డ రేవంత్‌రెడ్డిని చూసేనని చురకలించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఢిల్లీకి మూటలు మోయడం బంద్ పెట్టి ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రగతిని చూసి ఆశ్చర్యపోతున్నరు..
తెలంగాణ ప్రగతిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతున్నదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘కేంద్రం సహకరించకున్నా, జాతీయ ప్రాజెక్టు ఇవ్వకున్నా, విభజన హామీలు నెరవేర్చకున్నా సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? పంజాబ్, హర్యానాలను మించి ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యమైంది? ఇంతటి దిగుబడి ఎలా సాధించారని జాతీయ నాయకులెందరో తనను అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం సహకరించకున్నా, ఏ ఒక్క ప్రాజెక్ట్కూ జాతీయ హోదా ఇవ్వకున్నా రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి సాధించామని చెప్పారు. మూడున్నరేండ్లలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పునరుద్ఘాటించారు. ఇటీవలే తాము నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా ఎంతో బాగుందని బీఆర్ఎస్ పరిపాలన తీరును అభినందిస్తూ తనకు ఫోన్ చేశారని కేటీఆర్ తెలిపారు. సినీనటుడు రజనీకాంత్ హైదరాబాద్‌కు వచ్చి ఇది హైదరాబాదా? న్యూయారా? అని ఆశ్చర్యపోయారని, ఫాక్స్‌కాన్ చైర్మన్ హైదరాబాద్‌లో పర్యటించి ఇది ఇండియానా? అమెరికా నా? అని ఆశ్చర్యపోయారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ గొప్పతనం, ఎదుగుదల రేవంత్‌రెడ్డి లాంటి సన్నాసికి అర్థం కాకపోవచ్చని, ఆ ఆజీర్తితో ఏదైనా మాట్లాడుతాడని ఆయన ఎద్దేవా చేశారు.
రాహుల్‌బంధు బంద్చేస్తేనే అన్నీ సెట్
రాష్ట్రంలో రాహుల్ బంధు, పొంగులేటి బంధు, బ్రదర్స్ బంధు బంద్ చేస్తేనే అన్నీ సెట్ అవుతాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిస్థితి ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ చందంగా తయారైందంటూనే రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారని మండిపడ్డారు. ఓ వైపు అప్పు దొరకడం లేదంటూనే మరోవైపు రేవంత్‌రెడ్డి రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కార్ పదేండ్లలో 2లక్షల 80వేల కోట్లు అప్పు చేస్తే.. రెండున్నరేండ్లలో రేవంత్‌రెడ్డి రూ.4లక్షల కోట్లు అప్పు చేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాడు నెలకు తెలంగాణ ఆదాయం రూ.4వేల కోట్లు అని, తాము అధికారంలోకి దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.18,500 కోట్లకు చేరిందని వివరించారు. నాలుగున్నర లక్షల కోట్ల జీఎస్డీపీని 15లక్షల కోట్లకు చేర్చినట్టు వెల్లడించారు.
సీఎం, డిప్యూటీ సీఎం విరుద్ధ ప్రకటనలు
రైతులకు కేటాయించిన నిధులపై మంగళవారం ఒకే వేదికపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విరుద్ధ ప్రకటనలు చేశారని కేటీఆర్ ఆక్షేపించారు. 30 నెలల్లో లక్షా 75వేల కోట్లు రైతులకు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెబితే ఐదు నిమిషాల వ్యవధిలో డిప్యూటీ సీఎం మాత్రం లక్షా 56వేలు ఖర్చు చేశామని చెప్పారని గుర్తుచేశారు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.2400-2500 కోట్లు అప్పులకు వడ్డీ కడుతున్నట్టు కాగ్ లెక్కలు స్పష్టంగా చెబుతుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం రూ.6-7వేల కోట్లు అప్పు కడుతున్నామని చెప్పడమేమిటి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు కాగ్ లెక్కలు నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పే కాకి లెక్కలు నమ్మాలా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం కారణంగానే రాష్ట్రం విలువైన ఆస్తులన్నింటినీ కోల్పోతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఏడుగురు అన్నదమ్ములు, పొంగులూటీ సహా మొత్తం పది మంది దండుపాళ్యంలా ధనిక రాష్ట్రంపై పడి దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బ్లాక్మెయిల్
రాష్ట్రంలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి 30శాతం కమీషన్ల పేరిట లూటీ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తల తలకు తుపాకీ పెట్టే సంస్కృతి తెచ్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారని ఓ మంత్రి కుటుంబ సభ్యులు ఆరోపించింది నిజం కాదా? అని నిలదీశారు. చివరకు ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోను జైలులో పెడుతామని బెదిరించింది మీరు కాదా? అని నిలదీశారు. రాయదుర్గం భూముల విషయంలో కోర్టుకు ఎస్బీఐ వెళ్తే ఆ సంస్థను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయి ఉండి బేకార్ మాటలు మాట్లాడితే పెట్టుబడులకు ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు.
బూతులు తిట్టేందుకే ఎకరానికో సభ
మూర్ఖపు ముఖ్యమంత్రి మాటలు విని రైతులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు ఇచ్చేందుకు ఎకరానికో సభ పెట్టుడు.. బూతులు తిట్టుడు తప్ప సీఎం రేవంత్‌కు ఏదీ చేతగాదని వారికి కూడా అర్థమైందని పేర్కొన్నారు. తమ వద్ద స్మార్ట్ఫోన్లు ఉండవని, కనెక్టివిటీ ఉండదని యూరియా యాప్ ను తీసేయాలని కరీంనగర్, నిజామాబాద్‌లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో ధా న్యం కుప్పలపైనే పాండురంగ అనే రైతు ప్రా ణాలు విడిచారని గుర్తుచేశారు.
తీస్మార్ఖాన్ డైలాగులు.. బుడ్డర్ఖాన్ లెక్కలు
‘కేంద్రంపై యుద్ధం చేస్తా.. మోదీ ఎట్ల కొనడో చూస్తా.. చివరి గింజ దాకా కొనిపిస్తనని తీస్మార్ఖాన్ డైలాగులు కొట్టుడు.. మూడు రోజులు తిరుగకముందే మోదీ ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటానని బుడ్డర్ఖాన్ లెక్క తప్పించుకునుడు’ అంటూ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధాన్యం, పత్తి, మక్కలు, జొన్నలు కొనని ముఖ్యమంత్రి తమకెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారని దెప్పిపొడిచారు. ‘రేవంత్‌రెడ్డి గతంల మీరే అన్నరు కదా.. మోదీ కొనకుంటే కొనబోనని చెప్పేందుకు నువ్వేమైనా బ్రోకర్‌వా..10వేల కోట్లిస్తే పంటలు మొత్తం కొంటనని, బోనస్ కూడా ఇస్తనని కేసీఆర్‌కు సవాల్ విసిరితివి గదా.. మరీ ఇప్పుడేమైంది? చేతగావడం లేదా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందోననే తెలుసా? రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో తెలియడం లేదా?’ అంటూ కడిగి పారేశారు.
ఎగవేతలు.. కూల్చివేతలు తప్ప చేసిందేమిటి?
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఎగవేతలు, అన్ని వర్గాలను ఆగంచేయడం తప్ప చేసిన ఒక్కమంచి పనికూడా లేదని కేటీఆర్ తూర్పారబట్టారు. ‘రైతులకు రైతుబంధు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్, మహిళలకు మహాలక్ష్మి, వృద్ధులకు 4వేల పింఛన్ అన్నీ ఎగవేశారు.. 30 నెలల్లో కట్టిన ప్రాజెక్టు కూడా ఒక్కటీ లేదని, కూల్చివేతలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారని చురకలంటించారు. ‘వట్టెం పంప్‌హౌస్ మునిగింది.. సుంకిశాల కూలింది.. పెద్దవాగు కొట్టుకుపోయింది.. ఎస్ఎల్బీసీ కుప్పకూలి ఎనిమిది మంది మరణిస్తే శవాలు కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
రెండున్నరేండ్లలో రాష్ట్రం దివాళా
కేసీఆర్ పాలనలో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణను రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లలో దిగజార్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 4.20 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలో నంబర్‌వన్.. ఎస్వోటీఆర్(స్టేట్ వోన్ ట్యాక్స్ రెవెన్యూ)లో, జీఎస్టీ, ఎమర్జింగ్ స్టేట్స్లో నంబర్ వన్.. కానీ నంబర్ వన్ స్టేట్ కాస్త ఓటుకు నోటు కేసులో ఏ1కు దొరికిపోయింది. మీ పాలన రాగానే దివాళా తీయడం మొదలైంది. వరుసగా రెండేండ్లలో రెవెన్యూలోటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డౌన్, మోటర్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ డల్, సేల్స్ ట్యాక్స్ ఫాల్స్.. ఇలా అన్ని రంగాలు ఆగమాగం.. కానీ ఒక్క ‘మందు’గమనం తప్ప అంతా మందగమనే కదా.. రేవంత్‌రెడ్డి ఇది మీ ఘనత కాదా?’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘కేసీఆర్ పాలనలో లిక్కర్ బాగా పెరిగిందని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ పెట్టు.. మొత్తం బెల్ట్‌షాపులు మూసేయ్.. మందుషాపులు బంద్ చెయ్.. మద్యపానం నిషేధం పెట్టు! నిన్ను ఎవరాపుతున్నరు?’ అని ప్రశ్నించారు.
రైతులకు లక్షా 13వేలు ఎగ్గొట్టిన రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్షరాలా లక్షా 13వేల కోట్లు ఎగ్గొట్టిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతుబంధు పేరిట రూ.30,000 కోట్లు, కౌలు రైతులకు హామీ ఇచ్చి ఎగ్గొట్టిన మొత్తం రూ.22,500 కోట్లు, రుణమాఫీ కింద రూ.29,500 కోట్లు, రైతు కూలీలకు రూ.15,000 కోట్లు, పంటల బోనస్ రూ.16,000 కోట్లను సర్కార్ ఎగ్గొట్టిందని మండిపడ్డారు. అట్టర్‌ఫ్లాప్ సినిమాకు అర్ధ శతదినోత్సవం చేసిన చందంగా పేపర్లలో యాడ్లు ఇచ్చి మరి రైతు పండగల పేరిట డ్రామాలు ఆడుతున్నారని చురకలంటించారు. యాసంగి పంటకు 45రోజుల్లో మొత్తం రైతుబంధు వేస్తానని ఈ ఏడాది మార్చి 22న సీఎం చెప్పారని ఆ మాట చెప్పి 100రోజులు అయిపోయిందని గుర్తుచేశారు. నాడు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి, నేడు నాలుగు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ సమర్థతతోనే తెలంగాణ అగ్రగామి
రేవంత్‌రెడ్డి ఏడ్చినా.. ఎకసెక్కాలాడినా తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా అవతరించిందంటే దానికి కారణం కేసీఆరేనని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2. 80లక్షల కోట్ల అప్పులు చేసినా రైతుల అభ్యున్నతి కోసం రూ.5లక్షల కోట్లు ఖర్చు చేసిన ఖ్యాతి ఆయనకే దక్కిందని పునరుద్ఘాటించారు. ‘రైతుబంధుకు 73వేల కోట్లు.. రుణమాఫీకి 29వేల కోట్లు.. 24గంటల కరెంట్‌కు లక్ష కోట్లు, ఫ్రీ కరెంట్‌కు 50వేల కోట్లు.. కాళేశ్వరం, సీతారాంసాగర్, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు రూ.1.60 లక్షల కోట్లు.. ధాన్యం కొనుగోళ్లకు పదేండ్లలో రూ.1.32 లక్షల కోట్లు.. మిషన్ కాకతీయకు రూ.5,500 కోట్లు.. రైతుబీమాకు రూ. 6వేల కోట్లు.. రైతు వేదికలు, కల్లాలకు వేల కోట్లు.. మొత్తంగా 5లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చుచేసి తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు’ అని కొనియాడారు. ‘మేం నాడు మోటర్లకు మీటర్లు పెట్టబోమని తెగించినం.. కానీ నువ్వేమో బడేభాయ్ భయానికి రైతు డిస్కమ్ పేరిట రైతులకు ఉరిపెట్టే ప్రయత్నం చేస్తున్నవ్’ అని తూర్పారబట్టారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా కండ్లు తెరువు.. మాపై కేసులు పెట్టుకుంటే పెట్టుకో.. అది నీ ఇష్టం.. కానీ దయచేసి తెలంగాణ ప్రజలను మాత్రం శిక్షించవద్దని హితవు పలికారు. సిరిసంపదలతో తులతూగే రాష్ట్రాన్ని సూటిపోటి మాటలతో అన్నదాతల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడవద్దని విజ్ఞప్తిచేశారు.
రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ఫోబియా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటున్నారని, కేసీఆర్ ఎప్పుడు రావాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు. ప్రస్తుతం సీఎం తీవ్ర ఆత్మన్యూనతాభావంతో, ఐడెంటిటీ క్రైసిస్‌తో కొట్టుమిట్టాడుతున్నారని, కేసీఆర్ వస్తే తనను తాను ఎలివేట్ చేసుకోవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే సోది మొత్తం తాము వినబోమని, ఆయన నోటి నుంచి వచ్చే కంపు హైదరాబాద్‌లోని డ్రైనేజీ కంటే ఘోరంగా ఉంటుందని మండిపడ్డారు. 2029 తర్వాత రేవంత్ నెత్తి మీద రూపాయి పెట్టినా ఆఠాణాకు కూడా ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు.
చెల్లని నాణేనికి గీతలెక్కువన్నట్టు.. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను అని వేమన చెప్పినట్టు చేతగానివాళ్లే అడ్డగోలుగా
మాట్లాడుతరు. ఎంతటి అల్పుడైనా.. నేను దరిద్రుడినని మెడలో బోర్డు వేసుకొని తిరుగడు, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం మైక్ దొరికితే చాలు నోటికొచ్చినట్టు వాగుతడు.. రాష్ట్రం దివాళా తీసిందని అంటడు.. తెలంగాణను ఎయిడ్స్ రోగి అని ఓసారి, క్యాన్సర్ పేషెంట్ మరోసారి.. ఇలా పదులసార్లు దివాళాకోరుగా మాట్లాడిండు. ఇంతటి భావదారిద్య్రం ఏ ముఖ్యమంత్రిలోనూ చూడలేదు.
– కేటీఆర్
జీహెచ్ఎంసీలో మేం గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా అన్నడు.. మేం 99 కొట్టినం.. గెలిచినం పారిపోయిండు. కొడంగల్‌లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నడు.. ఓడిపోయిండు.. మళ్లీ సిగ్గుతప్పి పార్లమెంట్లో నిలబడ్డడు.. మరోసారి రైతును రాజును చేస్తున్న చర్చకు రా అన్నడు.. నేను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తే కల్లు కంపౌండ్‌కు రానని ప్రెస్మిత్రులను అవమానించేలా మాట్లాడి తప్పించుకున్నడు. సవాళ్లు విసరడం, వెన్నుచూపి పారిపోవడం ఆయనకు మొదటినుంచీ అలవాటే.
– కేటీఆర్