ముఖ్యమంత్రి భార్యకు సృజన్‌రెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయానా సోదరుడని మంత్రి చెప్తున్నారు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. ఒక్క రూపాయి అవినీతి జరిగినా, రూ.8,888 కోట్ల అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును సీఎం ఒప్పుకొని అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి.
– మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ పథకం టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. వెంటనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఏం జరగలేదు అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం. మంత్రిగారికి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
గతంలో ఉన్న ఫైల్స్‌తో పాటు ఇప్పటి టెండర్ల వ్యవహారం వివరాలు సీవీసీ లేదా రిటైర్డ్ జడ్జి ఎదుట ఉంచుదామని, న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత తాను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టంచేశారు. పొంగులేటి గతంలో కాంట్రాక్టర్‌గా ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజు మంత్రిగా ఉండి కాంట్రాక్టులు సంపాదించడం ముమ్మాటికి చట్టవ్యతిరేకమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఎంతోపాటు మంత్రి పొంగులేటికి కూడా తెలుసని పేర్కొన్నారు. కేవలం రెండు కోట్ల లాభం ఉన్న బామ్మర్ది కంపెనీకి రూ.1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా తాను ప్రస్తావించిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఆగమేఘాలమీద ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు.
ముఖ్యమంత్రి భార్యకి సూదిని సృజన్‌రెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయానా సోదరుడని, భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలని నిలదీశారు. ఒక్క రూపాయి అవినీతి జరిగినా, రూ. 8,888 కోట్ల అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా జరిగిన తప్పును సీఎం ఒప్పుకొని జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని సూచించారు. పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఈ బరితెగింపు మాటలు మానివేయాలని సూచించారు. లేకుంటే గతంలో అశోక్ చౌహాన్, యడ్యూరప్ప, సోనియాగాంధీ పదవులు పోయినట్టు మీ పదవులు కూడా పోతాయని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి భార్యకు సూదిని సృజన్‌రెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయాన సోదరుడు. భార్య తమ్ముడు బావమరిది కాకుంటే ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. ఒక్క రూపాయి అవినీతి జరిగినా, రూ. 8,888 కోట్ల అవినీతి జరిగినా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్తోపాటు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుంది.
– కేటీఆర్
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైనా మా దగ్గర సమాచారం ఉంది.. హైదరాబాద్‌కు దక్షిణాన నిర్మిస్తున్నది ఫోర్త్‌సిటీ కాదని, అది ‘ఫోర్బ్రదర్స్’ సిటీ.
-కేటీఆర్
ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఈ భారీ అవినీతికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెరతీసిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొమ్మి ది నెలల్లోనే ముఖ్యమంత్రి సోదరుడు అనుముల జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్లు పెట్టే స్థాయికి, రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డి రూ.2 కోట్ల నుంచి రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా వెళ్లారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైనా తమ దగ్గర సమాచారం ఉన్నదని తెలిపారు. హైదరాబాద్‌కు దక్షిణాన నిర్మిస్తున్నది ఫోర్త్‌సిటీ కాదని, అది ‘ఫోర్బ్రదర్స్’ సిటీ అని ఆరోపించారు. న్యాయస్థానాలను కూడా ఈ ప్రభుత్వం తప్పు దోవ పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు సీఎం కూడా చెప్పారని గుర్తుచేశారు. కానీ, న్యాయస్థానాల్లో మాత్రం అసత్య సమాచారంతో కూడిన పత్రాలను సమర్పిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొని, కోర్టుల్లో మాత్రం పార్టీలో చేర్చుకోలేదని చెప్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన ఈ అంశంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ మొదలుకొని ఎనిమిది మందిలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ నిలదీశారు.
సింగరేణి కార్మికులైన చీకటి సూరీళ్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ వెన్నుపోటు పొడుస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి లాభాల్లో 16 శాతం మాత్రమే కార్మికులకు పంచుతూ 33 శాతం వాటా ఇస్తున్నట్టు మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సింగరేణి నికర లాభాలు రూ.4,701 కోట్లు అయితే.. 33 శాతం వాటా అంటే కార్మికులకు రూ.1,551 కోట్లు బోనస్ ఇవ్వాలి. అంటే ఒకో కార్మికుడికి రూ.3.70 లక్షలు రావాలి. కానీ, కార్మికులకు ప్రకటించింది కేవలం రూ.796 కోట్లే. ఈ లెక్కన ఒక్కో కార్మికుడికి 16.9 శాతం మాత్రమే. కార్మికులకు హకుగా రావాల్సిన మిగతా వాటా రూ.754 కోట్లు ఎటు వెళ్లాయి. ఆల్‌టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా అందు కు తగ్గ ఫలితం కార్మికుల దక్కడం లేదు. కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ సర్కా రు నిజాలు చెప్పాలి. సింగరేణి లాభాల్లో 16 శాతమే ఇస్తున్నామని కాంగ్రెస్ సర్కారు ఒప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కోల్‌బెల్ట్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదా? అని నిలదీశారు. కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరిపై గుర్తింపు సం ఘం ఏఐటీయూసీతోపాటు సీపీఐ కూడా స మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడకపోతే సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి లాభాలు గణనీయంగా పెరగడంతో అందుకు అనుగుణంగా కార్మికుల వాటా పెంచుకుంటూ వచ్చామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పది పైసల వాటా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ పాలన ఉన్న ఐదేండ్లలో 10 పైసల వాటానే ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 11 పైసల నుంచి 20 పైసల వరకు మాత్రమే ఇచ్చారని చెప్పారు. 1999 నుంచి 2014 వరకు రూ.376 కోట్లు మాత్రమే సింగరేణి కార్మికులకు ఇచ్చారని, కాంగ్రెస్ పాలనలో లాభాలు ఎన్నడూ రూ.400 కోట్లు దాటలేదని చెప్పారు. లాభాలను వెయ్యి కోట్లు దాటించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తాము రూ.2,780 కోట్లు కార్మికులకు పంచామని పేర్కొన్నారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారని వివరించారు. సగటున ఒకో కార్మికుడికి రూ.1.60 లక్షలు చెల్లించామని గుర్తుచేశారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హరిప్రియానాయక్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.
ఆల్ టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా అందుకు తగ్గ ఫలితం సింగరేణి కార్మికుల దక్కడం లేదు. వారి కష్టాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ సర్కారు నిజాలు చెప్పాలి. సింగరేణి లాభాల్లో 16 శాతం మాత్రమే ఇస్తున్నామని కాంగ్రెస్ సర్కారు ఒప్పుకోవాలి. కోల్‌బెల్ట్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా?
– కేటీఆర్