రేవంత్‌రెడ్డీ.. మీరేమో
80 శాతం పంట కొనుగోలు పూర్తిచేసినంటున్నరు. సివిల్ సప్లయ్ మంత్రి 50 శాతం అని చెప్తున్నరు. ఎవరిది నిజం? చెప్పిన మాటపై నిలబడే వారైతే వెంటనే వడ్లు, మక్కలు, వేరుశనగ, ఇతర పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయండి. రాష్ట్రమంతా కోటిన్నర టన్నుల ధాన్యం పండితే మీరు కొన్నదెంత?
-కేటీఆర్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టు 80 శాతం పంట కొనుగోలు పూర్తయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఏ కొనుగోలు కేంద్రానికైనా సరేనని, చివరికి సీఎం నియోజకవర్గం కొడంగల్కైనా వచ్చేందుకు రెడీగా ఉన్నామని, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్లు, రేగా కాంతారావుతో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు.
పంట కొనుగోలు సంక్షోభం, అన్నదాతలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను ఏకరువుపెట్టారు. మొన్నటి ప్రెస్మీట్లో సీఎం అబద్ధాలు చెప్పారని ఎండగట్టారు. ముఖ్యమంత్రి డబ్బు సంచులపై పెడుతున్న శ్రద్ధ ధాన్యం సంచులపై పెడుతారని ఆశించి బహిరంగ లేఖ రాశానని, కానీ దురదృష్టవశాత్తు ఆయన అబద్ధాలు చెప్పి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. కనీసం వచ్చే క్యాబినెట్‌లోనైనా పంట కొనుగోలు సంక్షోభంపై చర్చించాలని, రైతుల కష్టాలే ఏకైక ఎజెండాగా చర్చించాలని డిమాండ్ చేశారు.
పంట కొనుగోలులో దారుణంగా విఫలమైన ప్రభుత్వం అన్నదాతల ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు చెప్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల మరణాలపై లేఖ ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇస్తే సివిల్ సైప్లె మంత్రి, సర్కార్ పెద్దలు ‘ఎవరూ చనిపోలేదు’ అని అతి కిరాతకంగా బుకాయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మంత్రి సొంత జిల్లా నల్లగొండలోని నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన నజీరుద్దీన్ అనే రైతు ధాన్యం కుప్పలపైనే కుప్ప కూలిపోయాడని, మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు నలుగురు రైతులు మరణించారని గుర్తుచేశారు. వారిని ఆదుకోవాలని తమ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు చేశారని చెప్పారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వెంకటేశ్, మెదక్ జిల్లా కొల్చారంలో శ్రవణ్‌కుమార్.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు పది మందిపైనే ఉన్నారని, కానీ ఒక్కరూ చనిపోలేదని మంత్రి అనడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.
‘పంటలు కొనక పోవడంతో గగ్గోలు పెడుతూ రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నరు. జనగామ జిల్లా ఏనెబావికి చెందిన పొన్నాల తిరుమలేశ్ అనే కాంగ్రెస్ కార్యకర్త కాంటా పెడుతలేరని అర్ధ నగ్నంగా నిరసన తెలిపాడని, కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో రైతులంతా రహదారిపై బైఠాయించారని గుర్తుచేశారు. పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయినా సీఎం మాత్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడని విరుచుకుపడ్డారు. అవసరమైతే ప్రభుత్వానికి రైతుల మరణాల వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 45 డిగ్రీల మండుటెండల్లో రైతులు పంటలు అమ్ము కొనేందుకు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదారు జిల్లాల్లో తిరిగాకే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డీ.. ఇప్పటికైనా భేషజాలకు పోకండి. పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తప్పించుకోకండి. ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మాని ధాన్యం దళారుల పాలుకాకుండా కాపాడి కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని గట్టెక్కించండి.
-కేటీఆర్
పదేండ్లు అన్నపూర్ణగా విరాజిల్లిన తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో తల్లడిల్లుతున్నది. రైతాంగం కన్నీరు పెడుతున్నది. హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత యాప్‌లలో తప్ప షాపుల్లో యూరియా దొరుకుతలేదు. రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా ఇవ్వలేదు. బోనస్‌ను ఖాతాల్లో జమ చేయలేదు. చివరికి పండించిన పంటను అమ్ముకునేందుకు అవకాశం లేదు.
-కేటీఆర్
ఆరుగాలం పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే కనీసం కాంటాపెట్టే పరిస్థితిలేదని, పెట్టినా 8 నుంచి 10 శాతం తరుగు తీసి రైతాంగాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. గన్నీ బ్యాగుల నుంచి మొదలుకొని సుత్లీ దారం వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. సెంటర్లలో నీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని, వెయిటింగ్ చార్జీలు సైతం రైతులే కట్టుకోవాల్సి వస్తున్నదని వాపోయారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరుకడంలేదు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకు తున్నాయని దెప్పిపొడిచారు. పట్టపగలే యథేచ్ఛగా కాల్పుల ఘటనలు, దొంగతనాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి ప్రతిపక్షాలు ఇస్తున్న సమాచారం, సలహాలు తీసుకొని పంట కొనుగోలు సంక్షోభాన్ని గట్టెక్కించాలని హితవుపలికారు.
‘మేం అధికారంలో ఉన్నం.. అంతా మాకే తెలుసు.. ఎవరు చెప్పినా పట్టించుకోం’ అని మూర్ఖంగా వ్యవహరించవద్దని సూచించారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం మనుగడ సాగించలేవు’ అని వ్యాఖ్యానించారు. బోనస్ ఎగ్గొట్టేందుకే సర్కార్ ధాన్యం కొనకుండా కుటిలపన్నాగం పన్నిందని మండిపడ్డారు. ‘సచ్చి నోడి పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్టు రైతులు దళారులకు అమ్ముకొనేలా కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి హూంకరింపులు, బెదిరింపులు మాని పంట కొనుగోలుపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. ‘కాంగ్రెస్ నేత మా పార్టీ నేతకు ఫోన్ చేసి ప్రభుత్వం ధాన్యం కొనుడేంది? కేసీఆర్ లేని పనిపెట్టిండ్రు అని నిష్టూరమాడుతున్నరు.. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి’ అని వివరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా పీడిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ’మొన్న ఢిల్లీ నుంచి రాష్ర్టానికి వచ్చిన పెద్ద మనిషి (మోదీ) చావు కబురు చల్లగా చెప్పిన్రు. యూరియా తక్కువ వాడాలి, బంగారం కొనవద్దు, పెట్రోల్ వాడొద్దని సలహాలిచ్చి రానున్న సంక్షోభాన్ని చెప్పకనే చెప్పిండ్రు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘దరిద్రపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇక్కట్లు తప్పవు.. రాష్ట్రంలో యూరియా దొరుకదు’ అని దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డి, మంత్రులు భూ హారతి ద్వారా భూ దోపిడీపై పెట్టే శ్రద్ధ..భూమిని నమ్ముకున్న రైతులపై పెట్టాలి’ అని హితవుపలికారు. క్రిశాంక్ బయటపెట్టిన వేం నరేందర్‌రెడ్డి భూ దోపిడీ, శంషాబాద్‌లో ముఖ్యమంత్రి అనుచరుడు సాగించిన వెయ్యికోట్ల భూ పందేరం వ్యవహారాలను ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంటే సీఎం మాత్రం వాటాలు పంచుకుంటూ చోద్యం చూస్తున్నారు.. ఆయనకు భూమిని కొల్లగొట్టడంపై ఉన్న ధ్యాస.. యూరియా సంచులపై లేదు’అని విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి హూంకరింపులు, బెదిరింపులు మాని పంట కొనుగోలుపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ నాయకుడు మా పార్టీ నేతకు ఫోన్ చేసి ప్రభుత్వం ధాన్యం కొనుడేంది? కేసీఆర్ లేని పనిపెట్టిండ్రు అని నిష్టూరమాడుతున్నరు.. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి.
-కేటీఆర్
రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్‌గాంధీ నోటి నుంచి 34 హామీలిప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకే బీఆర్ఎస్ రైతు సంగ్రామ సభ పెట్టిందని గుర్తుచేశారు. ‘ఆ సభలో నేను ముఖ్యమంత్రిని తిట్టలేదు.. గతంలో ఆయన మాట్లాడిన హౌలా, దివానా మాటలనే గుర్తుచేసిన’ అని స్పష్టంచేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు తప్పించుకున్నారని, నాలుగోసారి పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి..బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో పంట కొనుగోలుపై చర్చించి రైతులకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరణించిన వెయ్యి మంది రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, దిగిరాకుంటే ఉద్య మ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.