KTR | ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు.
వానల్లేక.. ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా? కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు.. విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నదని తెలిపారు.
కన్నెపల్లి పంప్ హౌజ్ మోటర్లను నడిపించి.. కరువు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా అని నిలదీశారు. ఎల్నినో పడగ విప్పుతుంటే..ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతూ కూర్చుంటారా? ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు? ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అని మండిపడ్డారు. మీ పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే రైతును మాత్రం ఆగం చేయకండి అని హితవు పలికారు.
కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను ఎండబెతున్న కాంగ్రెస్ కర్కశ పాలన తీరును ప్రశ్నించండి అని తెలంగాణ రైతన్నలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ.. కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోవాలన్నారు.