‘హింసించే పులకేశి’లాగా ఇంకా రెండేండ్లు రేవంత్‌ను భరించాలె. రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే. రేవంత్.. ఎంతమంది దేవుండ్లకు మొక్కుతవో మొక్కుకో! పాతాళంలో దాక్కున్నా సరే వదలం. ఇక నీకు ఉంటుంది! కేసీఆర్‌ను, కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టం.
-కేటీఆర్

హనుమకొండ, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లక్కీ డ్రాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి ఇంకా రెండేండ్లే ఉన్నదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, తమ పార్టీ కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి దేవుండ్లకు మొక్కుకోవాలని, పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టబోమని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పోలీసులు అతి చేయొద్దని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టడం తప్ప పాలన చేతకాదని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ సోమవారం భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లల్లో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డికి ఏమీ తెలియదు. చరిత్ర అసలే తెలియదు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో పుట్టిన మహాకవి దాశరథిని నిజామాబాద్ వెళ్లి అక్కడ పుట్టాడని అన్నడు. ఉత్తర భారతదేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా అన్నడు. బూతులు తిట్టడం తప్ప రేవంత్‌రెడ్డికి ఏమీ తెలియదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చిల్లరగా మాట్లాడలేదు. ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్‌ను ముఖ్యమంత్రులుగా చూసినం. ఇప్పుడు భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు.. డైలాగ్‌లు మాత్రం తీస్మార్ ఖాన్‌లా చెప్తున్నడు’ అని దుయ్యబట్టారు.

‘తెలంగాణ ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్‌రెడ్డి కాదు లాగుల తొండల్‌రెడ్డి’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు. హామీల గురించి అడిగితే లాగుల తొండలు విడుస్తానంటడు. ఫిబ్రవరి 9 వచ్చింది.. రైతుబంధు ఏమైందని గట్టిగా అడిగితే నీ లాగుల తొండలు విడిచిపెడుతానంటడు. తులం బంగారం ఏమైందంటే నీ గుడ్లు పీకి గోటీలాడుతానంటడు. ప్రతి నెలా రూ. 2,500 ఇస్తానన్నావు ఏమైందంటే నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటడు. ఎనకటికి ఒకడు ముఖం బాగా లేక అద్దం పగులగొట్టినట్టుగా రేవంత్‌రెడ్డి పనితీరు ఉన్నది. అత్తకు రూ.4 వేల పింఛన్, కోడలుకు రూ.2,500 ఇస్తనన్నడు.
ఎందుకిస్తలేరు? మీ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి ఇయ్యాలె కదా? సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ మీద ఒట్టు మీకు పింఛన్లు వచ్చినయా? రెండేం డ్ల కింద ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ను ఓడగొడితే డిసెంబర్లోనే అన్నీ ఇస్తమన్నరు కదా? ఇప్పు డు ఫిబ్రవరి 9 వచ్చినా రైతుబంధు వచ్చిందా? విద్యార్థినులకు స్కూటీలిచ్చిండ్రా? విద్యా భరో సా కార్డు, 5 లక్షల కార్డు, సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు వచ్చినయా? బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ వచ్చినయా? ఇన్ని రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నరుకుతం, పొడుస్తం అని నాటాకాలడుతున్నడు. కేసీఆర్ బంగారంలాంటి తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తే తొండల్‌రెడ్డి ఆగం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో రైతుబంధు టింగ్ టింగ్‌మని ఫోన్లలో పడేది. రేవంత్‌కు కేసీఆర్‌ను తిట్ట డం తప్ప పాలన చేతనైతలేదు’ అని దుయ్యబట్టారు.

‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడంటా.. అధికారం ఎవరికీ సొంతం కాదు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఆయన తరం కాదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘హింసించే పులకేశి సినిమాలాగా ఇంకా రెండేండ్లు రేవంత్‌రెడ్డిని భరించాలి. రెండేండ్ల తర్వాత మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే. నీ టైమింకా రెండేండ్లే. ఎంతమంది దేవుండ్లున్నారో మొక్కుకో.. నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే.. ఇక నీకు ఉంటుంది! కేసీఆర్‌ను, కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టం. ఇక్కడున్న పోలీసు అధికారులకు కూడా చెప్తున్నం. సర్కార్ ఎవరి అయ్య సొత్తూ కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అతి చేయొద్దు. సీఎం చెప్పిండని అమాయకులైన మా నాయకులు, కార్యకర్తలను ముట్టుకుంటే విడిచిపెట్టం. తప్పకుండా వెంటపడుతం. మేం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినం. రోషమున్నోళ్లం. కాంగ్రెస్ తప్పుడు హామీలపై నిలదీస్తం. బరాబర్ గల్లా పట్టి అడుగుతం. 420 హామీల అమలు కోసం కొట్లాడుతం. ఆడబిడ్డలకు ఇస్తామన్న నెలకు రూ.2500 ఎప్పుడిస్తవని అడుగుతం. రూ.4 వేల పింఛన్, తులం బంగారం ఇవ్వకపోతే వీపు చింతపండు చేస్తం’ అని హెచ్చరించారు.
‘రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నడు? సమైక్యవాది చంద్రబాబు సంకలో ఉన్నడు. సింగరేణి కార్మికులు బొగ్గు తీయడం మానేసి ఐదు రాష్ర్టాల్లో కరెంట్ ఆగిపోయేందుకు కారణమైనప్పుడు రేవంత్‌రెడ్డి ఎక్కడున్నడు? ఆ రోజు చంద్రబాబు అమ్మిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తుండేటోడు. ఇప్పుడు వచ్చి కేసీఆర్‌ను తిడుతున్నడు. రేవంత్‌రెడ్డీ.. నువ్వు లక్కీ డ్రాలో సీఎం అయినవ్. ఐదేండ్లు నడుపుకోలేక కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదు’ అని కేటీఆర్ హెచ్చరించారు. ‘చెయ్యి గుర్తుకు ఓటు వేస్తే అంతా ఆగమైంది. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తిమీద పెట్టుకుంటే బూడిదే.
రెండేండ్లలో అంతా భస్మమైంది. భూముల ధరలు పడిపోయినయ్. సింగరేణి ఆగమైంది. తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు నష్టపోయిండ్రు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చే పింఛన్లు పెంచింది కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లు పెంచుతామని చెప్పి ఉన్న పింఛన్లను తీసేసిండ్రు. పేదల ఇంట్ల పెండ్లికి తులం బంగారం ఇచ్చుడులేదు. మెడలో ఉన్న పుస్తెల తాడు ఎత్తుకెళ్లే దండుపాళ్యం బ్యాచ్ తయారైంది. అన్ని రకాలుగా దగా చేసి అబద్ధాలు చెప్పినవాళ్లు ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం వస్తున్నరు. ఈసారి ఓటు వేయకపోతే చచ్చిపోతామని కిరోసిన్ డబ్బా పట్టుకుని వస్తరు. వాళ్లు ఇచ్చే దావత్‌లు, డబ్బులు తీసుకుని బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని ప్రజలను కోరారు.

తెలంగాణ సిరులగణి సింగరేణిని రేవంత్‌రెడ్డి తన బామ్మర్దికి రాసిచ్చాడని కేటీఆర్ విమర్శించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న భూపాలపల్లికి వచ్చింది సింగరేణి కార్మికుల కోసం కాదు. ఇక్కడ ప్రజల కోసం కాదు. రేవంత్‌రెడ్డి సింగరేణిని బామ్మర్ది సృజన్‌రెడ్డికి రాసిచ్చిండు. రేవంత్‌రెడ్డి నల్లబంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం, వాళ్ల బామ్మర్దికి అప్పగించిండు. ఇక్కడ కొత్తగా సర్టిఫికెట్ దుకాణం పెట్టిండు. ఆయనకు నచ్చినోళ్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలట! ఆ సైట్ విజిట్ చేసినట్టు కంపెనీ వాళ్లు రాగానే వారి ఫోన్ నంబర్లు, వారి పేర్లు మొత్తం రేవంత్‌రెడ్డి బామ్మర్దికి పంపుతరు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది ఫోన్ చేసి ‘అరేయ్ నువ్వు టెండర్ వేయకురా’ అంటడు. టెండర్ వేయాలంటే ఇక్కడ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వరు. మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు రూ. 6 వేల కోట్లు రేవంత్‌రెడ్డి ఆయన బామ్మర్దికి రాసిచ్చిండు’ అని ధ్వజమెత్తారు.
ఆ కుంభకోణం బయటపెట్టగానే ఫోన్‌ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపిం గ్ అంటూ తమను వరుసపెట్టి పిలువడం మొదలు పెట్టారని చెప్పారు. ‘సింగరేణి కుంభకోణం నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు ఇట్లాంటివి చేస్తనే ఉంటడు. సింగరేణిని దొంగతనం చేస్తుండు. మంచిగ ఉన్న రైతులను ఆగం చేసిండు. సింగరేణి కార్మికులను నాశనం చేసిన రేవంత్‌రెడ్డికి, కాంగ్రెసోళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టకపోతే, బుద్ధి చెప్పకపోతే.. మహిళలకు రూ.2,500, రూ.4 వేల పింఛన్, రైతుబంధు అంతే సంగతులు. కేసీఆర్ హయాంలో 19 వేల మందికి మెడికల్ బోర్డుపెట్టి ఉద్యోగాలిచ్చిండు. అయినా తనకే ఓటేసిండ్రని రేవంత్‌రెడ్డి విర్రవీగుతున్నడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు వంద రూపాయలిస్తే పొలం దగ్గర యూరియా బస్తా వేసేటోళ్లు. ఇప్పుడు ఒక్క బస్తా దొరుకుతలేదు. వడ్లకు బోనస్ బోగస్ అయింది. అందుకే రేవంత్‌రెడ్డికి కర్రుకాల్చి వాతపెడితే సక్కగైతడు.
రేవంత్‌రెడ్డి రామకోటి రాసినట్టు రెండేండ్లుగా కేసీఆర్ జపం చేస్తున్నడు. దేశంలోని అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ హయాంలో చల్లా ధర్మారెడ్డి చేసిం డు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రూ.2 పని చేయలేదు. రోడ్లు, మోరీ వేశారా? బుగ్గలు మార్చారా? దళితులకు అంబేద్కర్ అభయహస్తం అన్నడు. కేసీఆర్ ఇచ్చే రూ.10 లక్షలు కాదని రూ.12 లక్షలు ఇస్తానని మోసం చేసిండు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నడు? కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు మున్సిపల్ ఎన్నికల రూపంలో మంచి మోఖా దొరికింది. బూతుల సీఎంకు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ నుంచే జరగాలి.
సందట్ల సడేమియాగా ఇంకొక్క పార్టీ ఉంటుంది. పూజకు పనికిరాని పువ్వు. 12 ఏండ్లలో తెలంగాణకు 12 పైసలు కూడా ఇయ్యలే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి వే లాది మంది పిల్లలకు కొలువులు వస్తాయని అబద్ధం చెప్పి తట్టెడు మట్టి తీయలే. కేంద్రం నుంచి రూ.15 లక్షలు వచ్చినోళ్లు బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేల పింఛన్ వచ్చినోళ్లు రేవంత్‌రెడ్డికి, రూ.2 వేల పింఛన్ వచ్చినోళ్లంతా కారు గుర్తుకు ఓటేయాలి. రెండేండ్ల కింద కాంగ్రెస్ అబద్ధాలు విని మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నం. రెండేండ్ల తర్వాత మళ్లీ అబద్ధాలతో వస్తున్నరు. ఇప్పుడు మోసపోవద్దు. ఆలోచించి ఓటెయ్యాలె. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కాంగ్రెస్ దగా చేసింది. బీఆర్ఎస్ పరకాలలో 11 మంది బీసీలకు టికెట్లు ఇచ్చిం ది. బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ.. గరీబోళ్ల పార్టీ.. పదేండ్లు తెలంగాణను అగ్రభాగాన నిలిపిన పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు.
పింఛన్లను పెంచుతమన్నోళ్లు ఉన్నవాటిని తీసేసిండ్రు. పేదల ఇంట్ల పెండ్లికి తులం బంగారాన్ని కాంగ్రెస్ ఇచ్చిందే లేదు. పైగా మెడలో పుస్తెల తాడును ఎత్తుకెళ్లే దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. అన్ని రకాలుగా దగా చేసి అబద్ధాలు చెప్పినవారు ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం వస్తున్నరు. ఈసారి ఓటు వేయకపోతే చచ్చిపోతామని కిరోసిన్ డబ్బా పట్టుకుని వస్తరు. వాళ్లు ఇచ్చే దావత్‌లు, డబ్బులు తీసుకుని బీఆర్ఎస్ను గెలిపించాలి.
-కేటీఆర్
ప్రజలకు పరిపాలన చేరువ చేసేందుకు కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేస్తే తీసేందుకు రేవంత్‌రెడ్డి ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ‘భూపాలపల్లిని కేసీఆర్ తలుచుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో జిల్లా చేశారు. భూపాలపల్లిని జిల్లా చేసింది కేసీఆర్.. మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్.. కలెక్టర్, ఎస్పీని కూర్చోబెట్టింది, వెయ్యి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించింది, సింగరేణి క్వార్టర్స్ కట్టించింది, 19 వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్.. సింగరేణికి న్యాయం చేసింది కేసీఆర్.. కేసీఆర్ మహబూబాబాద్ తాలుకా కేంద్రాన్ని జిల్లాగా చేసిండు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిండు. కొత్తగా కలెక్టరేట్‌తోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని పెట్టిండ్రు. మహిళా డిగ్రీ కాలేజీ, పాఠశాలల భవనాలు, మల్యాల హార్టికల్చర్ డిగ్రీ కాలేజీని తెచ్చిండ్రు.
మహబూబాబాద్‌ను జిల్లా చేసి కేసీఆర్ తప్పు చేసిండని రేవంత్‌రెడ్డి జిల్లాను ఎత్తేస్తా అంటున్నడు. రేవంత్‌రెడ్డీ.. నువ్వు జిల్లాలు పెట్టినవా? తీసేందుకు నువ్వెవరు? పెద్ద పోజులు కొడుతూ వచ్చి జిల్లా తీసేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రజలు అమాయకులు కాదు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల భూములను ప్రభుత్వం లాక్కుంటే మానుకోట గడ్డ మీద గర్జిస్తే తెలంగాణతో పాటు దేశం మొత్తం చూసిండ్రు. మళ్లీ అదే పోరాటం చేస్తరు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఓట్లను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి శిక్ష నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను కాలబెట్టాడని కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డి ఈ కేసు ఆధారాలున్న హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి అగ్గిపెట్టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్ష్యాలు లేకుండా మొత్తం ఆ ఫైళ్లన్నీ బూడిద చేశాడని తెలిపారు. జైలుకు పోకుండా కాపాడుకునేందుకు ఇలా చేశాడని వివరించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మం త్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, మాలోత్ కవిత, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యో తి, మాజీ చైర్మన్లు సాంబారి సమ్మారావు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.