 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ (BRS) మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వయంగా రంగంలోకి దిగనుండడంతో కారు పార్టీ ప్రచారపర్వం మరింత హోరెత్తనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి కేటీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి అన్ని డివిజన్లలో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. రోడ్‌షోలు, ర్యాలీలతో హోరెత్తించనున్నారు.
ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి. షేక్‌పేట నుంచి ప్రారంభించి బోరబండలో ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు షేక్‌పేట నాలా, శివాజీ విగ్రహం వద్ద రోడ్‌షో నిర్వహించనున్నారు. నవంబర్1న రహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావునగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌లలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. నవంబర్ 9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు నిర్వహించనున్న బైక్‌ర్యాలీలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక నాయకులు తెలిపారు.
ఇప్పటికే ప్రచారహోరుతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న కారు పార్టీ క్యాడర్లో కేటీఆర్ పర్యటనలు, ప్రచారంతో మరింత జోష్ పెరగనున్నది. రోడ్‌షోలు, ర్యాలీలకు జనం నుంచి అనూహ్య స్పందన రానున్నదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో ఆయన క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు.
 
                            