కరీంనగర్ : తెలంగాణ సాధన కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య ( Constable Kishtaiah ) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సోమవారం పరామర్శిం చారు. కరీంనగర్లో కిష్టయ్య నివాసానికి వెళ్లి అమరవీరుడు కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించు కున్నారు. మనవడు వేదాంత్ రాఘవ కిష్టయ్యను ఆశీర్వదించి, కూతురు డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్య కోసం కేసీఆర్ ఇచ్చిన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా కిష్టయ్య సతీమణి పద్మావతి, కుమారుడు రాహుల్, కోడలు వర్ష , కుమార్తె డాక్టర్ ప్రియాంకలతో కేటీఆర్ ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు బేబీ వేదాంత్ రాఘవ కిష్టయ్యను కేటీఆర్ ఆశీర్వదించారు. చిన్నారికి వస్త్రాలు, కానుకలు అందజేయడంతో పాటు, కిష్టయ్య పేరులోని కె అక్షరంతో రూపొందించిన ప్రత్యేక లాకెట్‌ను బహూకరించారు.
తమ ఇంటికి వచ్చి పరామర్శించి, మనవడిని ఆశీర్వదించి, కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు కుమార్తె విద్యకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కు కిష్టయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డా సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.