iPhone Theft | ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులతో పాటు ఓ ఐఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లాడు. అక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే.. అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. దొంగిలించిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేయలేక.. చివరకు అదే ఫోన్ యజమాని కుటుంబానికే మెసేజ్ చేశాడు. ‘పాస్‌కోడ్ చెప్పండి’ అంటూ పదేపదే అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు మెసేజ్‌ల స్క్రీన్షాట్లతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
డెహ్రాడూన్‌లోని సన్‌షైన్ ఎన్క్లేవ్ ప్రాంతానికి చెందిన కౌశికీ ధ్యానీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న క్లెమెంట్ టౌన్ ప్రాంతంలో పలు ఇళ్లలో చోరీలు జరిగాయి. కౌశికీ సోదరుడి ఫోన్ కూడా అదే సమయంలో చోరీకి గురైంది. ఒక్క ఫోన్ మాత్రమే కాదు.. ల్యాప్‌టాప్‌లు, మ్యాక్బుక్లు, ఇతర మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు కూడా పోయాయి. సమీపంలోని కొన్ని పీజీలు, హాస్టళ్లలోనూ ఇలాంటి చోరీలు జరిగాయి.
చోరీ జరిగిన తర్వాత కొంతకాలానికి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నుంచి కౌశికీకి మెసేజ్‌లు వచ్చాయి. అందులో ఫోన్ అన్‌లాక్ చేయడానికి పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. మొబైల్ నోటిఫికేషన్లలో కనిపించిన నంబర్ ఆధారంగా తాను మెసేజ్ చేశానని.. అర్జెంట్‌గా పాస్‌కోడ్ చెప్పాలని అడిగాడు. ఆ మెసేజ్‌లతో ఒక్కసారిగా బిత్తరపోయిన కౌశికీ.. తర్వాత తేరుకుంది. తన సోదరుడి ఫోన్ కొట్టేసిన దొంగనే పాస్వర్డ్ చెప్పాలని మెసేజ్ చేశాడని నిర్ధారించుకుంది. దీంతో మెసేజ్ వచ్చిన వెంటనే అంటే.. రాత్రి 10 గంటల సమయంలో దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అయితే ఉదయం వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించడంతో.. దొంగ పంపిన SMS, వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు, అనుమానితుడి ఫొటో, చోరీ జరిగిన ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి దగ్గర పెట్టుకుంది. అనంతరం జరిగిన విషయాన్ని ఆధారాలతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
కాగా, ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కౌశికీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించింది. దీంతో దొంగలు భయం లేకుండా మరింత రెచ్చిపోతున్నారని పేర్కొంది.