గువాహటి: ఒక బ్యాంక్ మేనేజర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. ఆమె తన నివాసానికి ఆహ్వానించడంతో అతడు అక్కడకు వెళ్లాడు. గదిలో ఆ మహిళతో బ్యాంక్ మేనేజర్ ఉండగా కొందరు వ్యక్తులు లోపలకు వచ్చి వీడియో రికార్డ్ చేశారు. అతడ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేశారు. (Extortion Trap) అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టిన్సుకియాకు చెందిన ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌కు జూలైలో ఇన్స్టాగ్రామ్ ద్వారా జోర్హాట్కు చెందిన ఒక మహిళ పరిచయమైంది. ఆగస్ట్ 14న ఆ బ్యాంక్ మేనేజర్‌ను జోర్హాట్కు రమ్మని ఆమె పిలిచింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత అతడు అక్కడకు చేరుకున్నాడు. ఆ మహిళను కలిశాడు.
కాగా, సియోని అలీ ప్రాంతంలోని ఒక అద్దె ఇంటికి ఆ బ్యాంక్ మేనేజర్‌ను ఆ మహిళ తీసుకెళ్లింది. వారిద్దరూ గదిలో ఉండగా కొందరు వ్యక్తులు తలుపు తట్టారు. ఆ మహిళ డోర్ తీయగానే వారు లోపలకు వచ్చారు. బ్యాంక్ మేనేజర్‌ను వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, అతడి కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు. ఆ వ్యక్తిని తొలుత రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. భయపడిన ఆ బ్యాంక్ మేనేజర్ ఆ డబ్బు ఇవ్వగా మరో లక్ష కూడా అతడి నుంచి బలవంతంగా వసూలు చేశారు.
మరోవైపు ఆ తర్వాత కూడా ఆ వ్యక్తులు బ్యాంక్ మేనేజర్‌ను మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. పదేపదే బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో చివరకు అక్టోబర్ 2న ఆ వ్యక్తి జోర్హాట్ పోలీసులను ఆశ్రయించాడు. హనీ ట్రాప్, బలవంతపు వసూళ్లపై ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు, జోర్హాట్లోని గర్ముర్ ప్రాంతానికి చెందిన సంజీబ్ దాస్, అంకిత్ పాల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఈ ముఠా కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారి మొరోమి దాస్ నియోగ్ అని పోలీసులు గుర్తించారు. ఆ మహిళను వెతకడం కోసం ఒక పోలీస్ బృందాన్ని దిబ్రుగఢ్‌కు పంపారు. చివరకు నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు.
అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న బేబీ బోరా అనే మరో మహిళ, ఆమె భర్త అంకిత్ బోరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలతో సహా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కార్యకలాపాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.