హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థీ ఒక యోధుడిగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఫైటర్లకే పదవులు దక్కుతాయని, చరిత్రలో స్థానం ఉంటుందని గుర్తుచేశారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన దీక్షా దివస్‌ను అన్ని వర్సిటీల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థిలోకం ఉద్యమించాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మంగళవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కేసీఆర్ హయాంలో పదేండ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. వివిధ కారణాలతో గురుకులాల్లో వంద మందికిపైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం నాణ్యమైన భోజనం కూడా విద్యార్థులకు కాంగ్రెస్ సర్కారు అందించలేకపోతున్నదని మండిపడ్డారు. ‘గత పదేండ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. వారి అబద్ధాలను ఎకడికకడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉన్నది’ అని సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చేనెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులను సమీకరించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో విద్యార్థి విభాగం చేపట్టిన ‘గురుకుల బాట’తో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చినా, అది కాంగ్రెస్ నాయకుల నటనగానే మిగిలిపోయిందని విమర్శించారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని సూచించారు. బీఆర్ఎస్వీ నేతలు అందరూ సమావేశమై జిల్లాలవారీగా చేపట్టాల్సిన ఆందోళనలపై చర్చించి కార్యాచరణ ప్రకటించాలని సూచించారు.
ప్రతి విద్యార్థికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలని, ప్రతి అంశంపై యాక్టివ్‌గా స్పందించాలని, సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలని కేటీఆర్ సూచించారు. ‘విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి’ అని పిలుపునిచ్చారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం పార్టీ తరఫున కాదని, విద్య, ఉద్యోగావకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఈ అంశంపై యువతను జాగృతం చేయాలని సూచించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పారు.
తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్ (నవంబర్ 29) ఒక గొప్ప మహాఘట్టంగా నిలిచిపోతుందని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధ్యమైందని తెలిపారు. జెన్ జడ్ జనరేషన్‌కు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగానే తెలుసని, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడిగా తెలియదని చెప్పారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టిన నాటి నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చి దీక్ష విరమించిన డిసెంబర్ 9 వరకు జరిగిన ఉద్యమాన్ని విద్యార్థిలోకానికి గుర్తుచేయాలని సూచించారు. దీక్షా దివస్‌ను అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆనాడు తెలంగాణ కోసం చేసిన త్యాగాలు, కేసీఆర్ పాత్రను వివరించాల్సిన అవసరం ఉన్నదని, యువకులకు ఉద్యమకాలంలో జరిగిన త్యాగాల గురించి వివరించాలని కోరారు. విద్యార్థుల పోరాటం, విద్యార్థి అమరుల త్యాగం తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పదని కీర్తించారు.
తెలంగాణ రాష్ట్రంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ర్టాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కేటీఆర్ సూచించారు. ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, తమ ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అరాచకాలపై ప్రతి విద్యార్థీ యోధుడిగా పోరాడి రాష్ట్ర వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నేతలు బాల్క సుమన్, గాదరి కిశోర్, బాలరాజు వంటి వారికి పదవులు దక్కాయని, పోరాడేతత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులోనూ పదవులు వరిస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, రాకేశ్, బాలరాజు యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామియాదవ్, తుంగ బాలు, నాయకులు శుభప్రద్‌పటేల్, శరత్‌గౌడ్, దశరథ్, శ్రీకాంత్ ముదిరాజ్, సత్యమూర్తి, రాజేశ్‌నాయక్ పాల్గొన్నారు.