‘తెలంగాణలోని ఏ మారుమూల పల్లెకు పోయినా, పట్టణానికి వెళ్లినా, ఆటో డ్రైవర్‌ను, ఆడబిడ్డలను, రైతన్నలను, ఓ చెల్లెను, తమ్ముడిని ఇలా ఎవరిని కదిపినా కేసీఆరే రావాలంటున్నరు.. ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నరు’ – కేటీఆర్
KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ): సమైక్య పాలకుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేద్దామని, ఇందుకోసం 60 లక్షల మంది గులాబీ దండు కలిసికట్టుగా కదులుదామని, తెలంగాణ పసిగుడ్డును ఆయన చేతిలో పెడదామని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణలోని ఏ మారుమూల పల్లెకు పోయినా, పట్టణానికి వెళ్లినా, ఆటో డ్రైవర్‌ను, ఆడబిడ్డలను, రైతన్నలను, ఓ చెల్లెను, తమ్ముడిని ఇలా ఎవరిని కదిపినా కేసీఆరే రావాలంటున్నరు.. ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నరు’ అని చెప్పారు. ‘నాకే కాదు.. కేసీఆర్ నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలందరికీ హీరో’ అని అభివర్ణించారు. ఆ మహానుభావుడి కడుపున పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు.
సోమవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదినోత్సవానికి కేటీఆర్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పెద్దసంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అలుపెరగని పోరాటంతో ఉమ్మ డి పాలకులను ఎదిరించి తెలంగాణను సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. మనీ, మీడియా, మజి ల్ పవర్లేకున్నా కులబలం అండగా లేకున్నా గుండెబలంతో 25 ఏండ్ల కిం దటే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, తెలుగు రాష్ర్టాల రాజకీయాలను శాసించిన ధీశాలి కేసీఆర్ అని ఉద్ఘాటించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ప్రతికూల ఫలితాలు వచ్చినా వెనుదిరిగి చూడకుండా చావునోట్లో తలపెట్టి తెలంగాణ కలను సాకారం చేసిన యోధుడని కిర్తీంచారు. ‘మనమందరం రాబోయే మూడున్నరేండ్లు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం..ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లి మహానేతకు తెలంగాణను అప్పగిద్దాం’ అని పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కలిసికట్టుగా ముందుకెళ్దామని సూచించారు.