KTR | రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతామని తెలిపారు.
హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై క్లారిటీ లేదని అన్నారు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రైతుబంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి, నిలదీయండి అని పిలుపునిచ్చారు.
నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ను రైతన్నలు పాతరేస్తారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేసిన దానికి మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవని విమర్శించారు. కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్/రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయిందని అన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడని చెప్పారు.
డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది.. కానీ ఎందుకు సంబరాలు చేయాలి.. రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా అని నిలదీశారు. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని ఎద్దేవా చేశారు.
రైతు రుణమాఫీ, రైతుబంధుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు కానీ.. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారని విమర్శించారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 10 వేలు, తరువాత 15 వేలు రైతు భరోసా అన్న కాంగ్రెస్ నేతల మాటలు ఎక్కడ పోయాయని నిలదీశారు. గతంలో ఇచ్చిన పదివేలనే బిచ్చం అన్న రేవంత్.. మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి? ముష్టి వేస్తున్నావా అని మండిపడ్డారు.