హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొనే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలుకనున్నారు. స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దావోస్ సమ్మిట్‌లో పాల్గొనే ముందు రోజు (ఈ నెల 15న) జురిక్ నగరంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె, ఎన్ఆర్ఐలు కిషోర్ తాటికొండ, అనిల్ జాల, కృష్ణారెడ్డి అల్లు వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్‌లో 2018లో తొలిసారి మంత్రి కేటీఆర్ పాల్గొని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచారని గుర్తుచేశారు. ఈసారి అదే ఒరవడితో తెలంగా ణ జైత్రయాత్ర కొనసాగాలని ఆకాంక్షించారు.