హైదరాబాద్ జూన్ 24 (నమస్తేతెలంగాణ): ‘ఉచిత కరెంట్‌తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో అండగా నిలిచి.. వంద శాతం కొనుగోళ్లతో భరోసా ఇచ్చి.. కరోనా కాలంలోనూ కర్షకుల కష్టాలను గుర్తెరిగి రైతుబంధు, రైతుబీమాను కొనసాగించి.. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిపి..అంతకుముందు కాంగ్రెస్ పాలనలో దండుగలా మారిన వ్యవసాయాన్ని కేసీఆర్ పదేండ్ల పాలనలో పండుగలా తీర్చిదిద్దిండ్రు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
కానీ ఏడాదిన్నర రేవంత్‌రెడ్డి పాలనలో సాగు మళ్లీ దండుగలా మారిందని మంగళవారం ఎక్స్‌వేదికగా విమర్శించారు. ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని రూ.12 వేలకే కుదించారని మండిపడ్డారు. ‘ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టి.. రైతుబీమాను పక్కనబెట్టి, రుణమాఫీని తుంగ లో తొక్కి, క్వింటాల్ వడ్లకు రూ. 500 బోనస్‌కు సున్నం పెట్టి, కళ్లాల్లో ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించి..రైతులను పండుగ చేసుకోవాలనడం సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు. ఓట్లు దండుకొని కాంగ్రెస్ చేసిన మోసాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.