సిరిసిల్ల రూరల్, ఆగస్టు 17: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన కుమార్తె పెండ్లికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నేత కర్కబోయిన కుంటయ్య కాంగ్రెస్ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక జూన్ 16న రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్లో ‘కేటీఆర్ అన్నా.. నా కుటుంబాన్ని ఆదుకో’ అని తన గోడు వెళ్లబోసుకున్నాడు. విషయం తెలిసి చలించిపోయిన కేటీఆర్ వెంటనే సిరిసిల్లలోని దవాఖానకు చేరుకొని కుంటయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుంటయ్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఇద్దరు కూతుర్ల చదువుతోపాటు వివాహాలు, ఇతర అన్ని విషయాలను తానే చూసుకుంటానని భరోసా కల్పించారు.
ఈ క్రమంలో కుంటయ్య దవాఖాన ఖర్చులు, అంత్యక్రియలు, పెద్దకర్మ వరకు అన్ని ఖర్చులు అందించి, పార్టీ నేతలతో నిర్వహించారు. జూలై 17న చిన్నకూతురు దీక్షతకు రూ.3 లక్షల నగదును కేటీఆర్ అందించారు. ఆ మరుసటి రోజు ఆ డబ్బులను దీక్షిత పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, పార్టీ నేతల చేతుల మీదుగా బాండ్‌ను అందజేశారు. అయితే కుంటయ్య మృతి చెందకముందే పెద్ద కూతురు భార్గవి వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో వివాహం ఘనంగా జరిపించారు. కుంటయ్య కూతురు వివాహానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి, పెళ్లి ఖర్చులు తానే భరించి ఘనంగా జరిపించారు.
ఈ వేడుకలకు కేటీఆర్ హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు కుంటయ్య భార్య విజయ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. కుంటయ్య కుటుంబానికి ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకోవడం, కుటుంబానికి అన్నీ తానై కేటీఆర్ నిలవడంపై పార్టీనేతలు, గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, జక్కుల నాగరాజు యాదవ్, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మీరాల భాస్కర్‌యాదవ్, అడ్డగట్ల భాస్కర్, కుర్మ రాజయ్య, బాలయ్య, పర్శరాములు, ఆత్మకూరి చంటియాదవ్, మోతే మహేశ్‌యాదవ్, నాంపల్లి ఉన్నారు.