KTR | నిజామాబాద్ : గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్షమన్నారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు ధీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేశారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేశాం. ప్రజలు కష్టాల్లో ఉన్న కరోనా సమయంలో సొంత డబ్బుతో గణేష్ గుప్తా సేవలు అందించారు. తెలంగాణలో 10 ఏండ్లలో ఒక్క మత ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మత పరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డిలో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడని విమర్శించారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.
12 వేల కోట్ల రూపాయల నిధులు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి మైనార్టీ గురుకులాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ముస్లింలు అత్యధికం గా ఉన్న యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఇవ్వనన్ని నిధులు సీఎం కేసీఆర్ తెలంగాణలో ఇచ్చారు. ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. సీఎం పీఠం కోసం మత ఘర్షణలు చేసే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దామా ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. మైనార్టీలు నిరుపేదలుగా ఉన్నారని రాహుల్ గాంధీ ఈ రోజు అంటున్నాడు. 11సార్లు అవకాశం ఇస్తే ఎందుకు వారి అభివృద్ధి కోసం పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రతి సారి ముస్లింలను మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదు, భవిష్యత్‌లో కూడా జత కట్టదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు భయపడేది లేదన్నారు. పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి ఓటు వేస్తే ఆయన మళ్లీ ఎక్కడ కూడా కనపడడు. 11 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.