హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ) : రైతుబంధును ఆపి, రైతుబీమాను బొందపెట్టిందెవరు? రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్ ఎగ్గొట్టిందెవరు? అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతుబంధు పథకాన్ని ఆపడానికి తామేమైనా దివానాగాళ్లమా? అని రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఒక్కసారే వేసి మిగతా మూడుసార్లు ఆపిందెవరని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎకే విమానం, దిగే విమానం తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని, రైతు వారోత్సవాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో అంతా సాఫీగా సాగుతుంటే కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అన్నివర్గాలను మోసం చేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ పదివేలే ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తాం. ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలే.. డిసెంబర్లో తీసుకుంటే రూ.7,500 అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఉరుకుండ్రి రూ.2 లక్షలు అప్పు తెచ్చుకోండ్రి. డిసెంబర్ 9న సంతకం పెడుతామని ఉరికించి రైతులను మోసం చేశార’ని నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లను నమ్మి మోసపోతే గోసపడుతామని కేసీఆర్ చెప్పిండు. అప్పుడు రేవంత్‌రెడ్డి మేమేమన్నా హౌలాగాళ్లమా.. దివానాగాళ్లమా అని మాట్లాడిండు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరినీ ఆదుకుంటామని రేవంత్ మోసం చేశారని విమర్శించారు.
రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటదని కానీ ఓపి క నశిస్తే భూకంపం పుట్టించే శక్తి అదే రైతుకు ఉంటదని కేటీఆర్ చెప్పారు. ‘రేవంత్ యాది పెట్టుకో! దేశానికి అన్నం పెట్టే అన్నదాతను అడుక్కునేటోనిలా చూస్తున్నవ్. కేసీఆర్ మీటింగ్ పెట్టగానే ఒక కిస్తు.. రెండో మీ టింగ్ పెడ్తే ఇంకో కిస్తు. మార్చిలో ఒక ఎకరం. ఏప్రిల్‌లో ఇంకో ఎకరానికి ఇస్తా అని తమాషాలు చేసుకుంట, బట్టేబాజీ మాటలు, బలుపు మాటలు మాట్లాడున్నడు.. నా ఇష్టం వచ్చినప్పుడు వేస్తా అంటే నీ ఇంటిముందు జోలె పట్టుకొని నిల్చునేటందుకు రైతులేమన్నా బిచ్చగాళ్లా? రైతుకు నాగలితో దున్నడం తెలుసు. అదే నాగలిని తిరగేసి కాంగ్రెసోళ్లను ఊరూరికి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టడం కూడా తెలుసు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో రైతుబంధు వేసేందుకు సీఎం వద్ద డబ్బులు లేవు కానీ, రాహుల్‌గాంధీకి మూటలు పంపేందుకు మాత్రం డబ్బులు ఉంటాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతుబంధు పోయి రాహుల్‌బంధు అమలవుతున్నదని విమర్శించారు. అందుకే ఆయన రెగ్యుల్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం. నెలకోసారి కప్పం కట్టి రెన్యూవల్ చేయించుకోవాలి. లేకుంటే రేవంత్‌కు బతుకుదెరువు లేదు. కుర్చీ గుంజిపడేస్తరు. రైతులకు ఎగ్గొట్టి రాహుల్‌కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్‌రెడ్డి యాది పెట్టుకో.. రైతులకు కోపం వచ్చిననాడు ఏ రాహుల్‌గాంధీ.. ఏ సోనియాగాంధీ.. ఏ ప్రియాంకాగాంధీ నీ కుర్చీని కాపాడలేరు. గుర్తు పెట్టుకో ఒక్కో ఎకరానికి రూ.26,500 బాకీ పడ్డరు. రూ.30వేల కోట్లు రైతులకు బాకీ పడ్డడు రేవంత్‌రెడ్డి’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘ఓట్లకు ముందు ఏతులు.. ఓట్లేసుకున్నంక ఎగవేతలు. ఏ రేవంత్‌రెడ్డి అంటే ఏతుల రేవంత్‌రెడ్డి, ఎగవేతల రేవంత్‌రెడ్డి’ అని కేటీఆర్ అభివర్ణించారు. ‘చివరి ఆరు నెలలకు మళ్లీ ప్రజలను మోసం చేయవచ్చని అనుకుంటున్నరు. యూరియా కష్టాలు, మక్కల రైతుల పడిగాపులు అన్నీ మర్చిపోతరు అనుకుంటున్నరు. రుణమాఫీ పంచపాండవులు మంచంకోళ్ల కథలెక్క ఉన్నది. ఒక్క ఊర్ల కూడా రుణమాఫీ కాలే. రేవంత్‌రెడ్డీ నీకు దమ్ముంటే ఏ ఊరికి పోదామో చెప్పు? నీ కొండారెడ్డిపల్లికి పోదా మా? గంగదేవిపల్లికి పోదామా? కొడంగల్‌కు పోదా మా? ఏ ఊరికి పోదామో చెప్పు ఏ ఊరిలోనైనా రైతులు 100శాతం రుణమాఫీ జరిగిందని రాసిస్తే శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే సవాల్ స్వీకరించు.. రేవంత్‌రెడ్డి వస్తడా? తుమ్మల వస్తడా రండి. చారాణా జరిగింది వాస్తవమా కాదా?’ అని ప్రశ్నించారు.