హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటే మొక్క కాదు.. ఊడల మర్రి అని, తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ అనే మర్రికి ఉన్న ఊడలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సభలు, సమావేశాల్లో ఎత్తు కుర్చీలేసుకుంటే పెద్దోళ్లు కారని.. మంచి పనులు చేసి ప్రజల మనసును గెలిస్తే పెద్దోళ్లు అవుతారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హితవుపలికారు. రేవంత్‌రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ అనే పేరును ప్రజల్లో లేకుండా చేస్తాం.. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో ఎదగనీయనం టూ రేవంత్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్న విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు.
గుర్రం విలువ గాడిదను చూస్తేనే తెలుస్తుందన్నట్టు కేసీఆర్ విలువ కూడా 11 నెలల రేవంత్ పాలనలో ప్రజలకు తెలిసొచ్చింది. ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ను పోగొట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నరు. ఎంతమంది నేతలు పార్టీ మారినా కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్కు అండగా ఉన్నరు. అందరం కలిసికట్టుగా 29న చేపట్టే దీక్షా దివస్‌ను విజయవంతం చేద్దాం.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చోటే భాయ్, బడే భాయ్లా మారారని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకొని దోస్తానా నడిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తుంటే మొట్టమొదట హైడ్రాకు మద్దతుగా మాట్లాడింది బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్‌రావు మాత్రమేనని గుర్తుచేశారు. రాజ్ పాకాల ఇంట్లో దీపావళి దావత్ జరిగినప్పుడు కూడా మందు పార్టీ, డ్రగ్స్ పార్టీ అం టూ కాంగ్రెస్ నేతల కంటే ముందుగా బండి సంజయ్ మాట్లాడారని, ఇవన్నీ చూస్తుంటే రేవంత్, సంజయ్ మధ్య ఉన్న స్నేహబంధం ఏమిటో స్పష్టమవుతున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తమ బాధలు చెప్పుకోవడానికి తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను పోగొట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడి పోరాడుతుందని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సకల జనులు అవస్థలు పడుతున్నరు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రజలు ఇష్టంవచ్చిన బూతులు తిడుతున్నరు. తిట్టినా ఫర్వాలేదుగాని సీఎం పదవికి గౌరవం ఇవ్వాలని ప్రజలను వేడుకునే పరిస్థితికి రేవంత్‌రెడ్డి దిగజారిండు. ఇంత తొందరగా ప్రజావ్యతిరేకత వచ్చిన ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కారే.
– కేటీఆర్
హైదరాబాద్ ప్రజలు చైతన్యవంతులని కేటీఆర్ చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. ఎంతమంది నేతలు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్కు అండగా ఉన్నారని తెలిపారు. 29న చేపట్టే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని రేవంత్‌రెడ్డి ముక్కలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఓఆర్ఆర్ వెలుపల, లోపల అంటూ సిటీ పూర్వ వైభవా న్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలంతా ఏకమై రేవంత్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి ఈ నెల 29 నాటికి 15 ఏండ్లు పూర్తవుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తుచేశారు. 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. దీక్షా దివస్ సందర్భంగా నిమ్స్‌లో రోగులకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు బసవతారకం క్యాన్సర్ దవాఖాన సర్కిల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంపై ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందని వెల్లడించారు.
స్వరాష్ట్ర సాధన కోసం పదవులు, ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేసిన మహానేత కేసీఆర్ అని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి కొనియాడారు. సుదీర్ఘ కాలం కేసీఆర్‌తో ఉద్యమంతోపాటు, పార్టీలో కలిసి పనిచేయడం మన అదృష్టమని చెప్పా రు. పట్టుదలతో రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల సుభిక్షమైన పాలన అందించి ఔరా అనిపించుకున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో ఎదగనీయనంటూ రేవంత్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నడు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలె. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ పేరును ప్రజల గుండెల్లోంచి ఎవరూ తొలగించలేరు.
-కేటీఆర్
తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించేలా తన పోరాటంతో కేంద్రం మెడలు వంచిన ధీరుడు కేసీఆర్ అని, సుదీర్ఘ పోరాటం చేయడమే కా కుండా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను సైతం జై తెలంగాణ అనేలా చేసిన వీరుడు కేసీఆర్ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో యావత్ తెలంగాణ సమాజం కదిలివచ్చిందని గుర్తుచేశారు. 29న నిర్వహించే దీక్షా దివస్ తెలంగాణకు దిక్సూచిగా ఉండేలా చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
11 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. సీఎం పదవి నుంచి రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా దిగిపోవచ్చని జోస్యం చెప్పారు. ఎన్నికల కోసం హైదరాబాద్ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్‌కు తిట్లు, హామీలకు తూట్లు పొడిచిండు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘ఏడాదిలో ఏమీ సాధించలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఒరగబెట్టిందేమీ లేకుండానే సంబురాలు జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంవత్సరీకం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు’ అని విమర్శించారు.
మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో? కాంగ్రెస్‌ను ఎప్పుడు పాతరపెడదామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థుల ఆత్మహత్యల సాక్షిగా చెబుతున్నా ఈ ప్రభుత్వ పాలన పట్ల ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు.