KTR | కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? ఇంత అహంకారమా? అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలని ఫైరయ్యారు. ‘రైతులారా! రైతుబంధు ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో, ఓటుతో కొడతారో మీ ఇష్టం’ అని అన్నారు. చెప్పుతో కొడతానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. బుధవారం కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ సోషల్ మీ డియా వారియర్స్ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యా రు. పెద్ద సంఖ్యలో వచ్చిన వారియర్స్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఎం మోదీకి కలిశాకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ వచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను అణచి వేసే కుట్ర చేస్తున్నాయని తెలిపారు.
డిసెంబర్ 9నే రుణమాఫీ అని అబద్ధాలు
‘రుణాలు తీసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని, డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఫిబ్రవరి 9 వస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ విషయం మాట్లాడటం లేదు. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, యువత, రైతుల పేరిట చేసిన డిక్లరేషన్ ప్రకారం చూసుకుంటే 420 హామీలు ఉన్నాయి. ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ బట్టలు ఊడగొట్టక తప్పదు’ అని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తామని, జనవరి నుంచి కరెంట్ బిల్లులు కడతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న కేసీఆర్ పైసాపైసా కూడబెట్టి 70 లక్షల మంది రైతులకు వారంలో రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు.
గుంపుమేస్త్రీగా అనుకునే రేవంత్‌రెడ్డికి రైతుబంధు ఎట్లియ్యాలో తెలియడం లేదని ఎద్దేవాచేశారు. రైతుబంధు పేరును రైతు భరోసా అని మార్చి డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే రైతులు చీరి చింతకు కడతారని వెల్లడించారు. రైతుల పక్షాన పోరాడాలని సోషల్ మీడియా వారియర్స్‌కు సూచించారు. ఆటో కార్మికులు నమ్మి ఓటేస్తే వాళ్ల కొంప కొల్లేరు చేశారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఆర్టీసీలో ఫ్రీ, ఫ్రీ అని అంటే ఇప్పుడు సీట్ల కోసం మహిళలు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని, పైసలు పెట్టి టికెట్లు కొనుక్కునే పురుషులు కూడా తిట్టుకోవల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్కు రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలను, ఇప్పుడు సోషల్ మీడియాలో నిందించటం మంచిది కాదని వారియర్స్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజల మనసును మళ్లా ఎట్లా గెలుచుకుందాం? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎలా ఎగురవేద్దాం? అన్న దిశగానే ఆలోచించాలని, ప్రజాతీర్పును అవమానించొద్దని సూచించారు.
బీజేపీ ఎంపీలను ఓడించింది బీఆర్ఎస్సే
బీజేపీలో పెద్ద నేతలమని చెప్పుకుంటున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, సోయం బాపూరావును ఓడించింది ఏ పార్టీ? అని, రాజాసింగ్‌ను దాదాపు ఓడించింది ఏ పార్టీ? అని కేటీఆర్ ప్రశ్నించారు. వీళ్లందరినీ ఓడించింది బీఆర్ఎస్సే అని స్పష్టం చేశారు. మా జీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. సోషల్ మీ డియా అత్యంత శక్తిమంతమైనదని, తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, పలు జిల్లాల జడ్పీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు కేటీఆర్ పరామర్శ
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గా లన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆమెను, కుటుంబసభ్యులను కేటీఆర్ బుధవారం పరామర్శించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వేంకటేశ్వర్లపల్లికి వెళ్లి గాలన్న చిత్రపటానికి నివాళి అర్పించారు. కేటీఆర్ వెంట నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఎన్నికల ముందు దొంగ అని తిట్టిన అదానీతో కౌగిలింతలు
‘ఎన్నికల ముందు అదానీని దొంగ అని తిట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు విదేశాల్లో కౌగిలించుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను అదానీకి అప్పగించాలని చూస్తున్నారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదానీ మోదీ మనిషి అని తెలిసే కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనీయ లేదని, ఇప్పుడు తెలంగాణలో అదానీ అడుగుపెట్టడమే కాదు.. భవిష్యత్తులో విద్యుత్తు, ప్రభుత్వ సంస్థలను, కాంట్రాక్టులను అదానీకి ఇవ్వడానికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చీకటి ఒప్పందాలు, రహస్య సంబంధాలను ఎండగట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఏక్‌నాథ్‌షిండే అయినా ఆశ్చర్యపోనక్కర లేదని వ్యాఖ్యానించారు.